ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన రేవులలో (పోర్టులలో) 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నౌకాశ్రయాలకు ముప్పు పొంచి ఉందని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా,తూర్పుగోదావరి జిల్లా,ఏలూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్థానిక యంత్రాంగం కోరింది.
అల్పపీడనం మరింత బలపడుతుండటంతో కోస్తా తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షిత తీరాలకు చేరుకోవాలని సూచించారు.
