ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని సమాచారం. ఈ మార్పుల్లో భాగంగా ప్రస్తుత కేబినెట్ నుండి కొందరు సీనియర్లను తప్పించి, యువ నేతలకు మరియు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది.
వచ్చే వారం పది రోజుల్లో జరగబోయే ఈ మార్పులపై జాతీయ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవలే అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కీలక నేతలు సమావేశమవడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎల్‌కే అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని మోదీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చూస్తోంది. ప్రభుత్వంలో అమిత్ షా పాత్రను మరింత విస్తృతం చేయడం ద్వారా, భవిష్యత్తులో ఎన్డీయేను మరింత బలోపేతం చేయవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీయే నాలుగోసారి కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో “ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎవరు? అనే ప్రశ్నపై పార్టీ లోపల, భాగస్వామ్య పక్షాల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. మోదీ తర్వాత నంబర్-2 అమిత్ షానే అనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైంది.
అమిత్ షాకు ఉప ప్రధాని పదవిని కట్టబెట్టడం ద్వారా..పార్టీలో మరియు కూటమిలో ఉన్న గందరగోళానికి చెక్ పెట్టవచ్చు.ప్రధాని రేసులో మరికొంత మంది పేర్లు తెరపైకి రాకుండా ముందే అడ్డుకట్ట వేయవచ్చు.తదుపరి పగ్గాలు అమిత్ షావేనని స్పష్టం చేస్తూ, క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపవచ్చు.త్వరలోనే జరగబోయే ఈ కేబినెట్ మార్పులు దేశ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.
