ప్రముఖ బెంగాలీ నటుడు, రచయిత సౌమిత్ర ఛటర్జీ(85) నేడు మృతిచెందారు. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు స్పష్టం చేశారు. ఛటర్జీ మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సౌమిత్ర ఛటర్జీ బాలీవుడ్‌లో నిరుపమ, హిందుస్థాన్ సిపాయిలాంటి హిట్ చిత్రాల్లో నటించారు. బెంగాలీలో ఆయన నటించిన పలు చిత్రాలు విజయం సాధించాయి. నాటి ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వంలో.. అపూర్ సంసార్ (1959) చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రేతే అభిజన్, చారులత, అరణ్యన్ దిన్ రాత్రి, ఆషాని సంకేత్, సోనార్ కెల్లా చిత్రాల్లో నటించారు.
ప్రముఖ దర్శకులు మృణాల్ సేన్, తపన్ సిన్హా, అజిత్ సేన్ వంటి ప్రముఖుల చిత్రాల్లోనూ నటించి మెప్పించారు సౌమిత్ర. ఆయన 2004లో పద్మభూషణ్ అవార్డు, 2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
