మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దళిత వృద్ధ మహిళపై జరిగిన అత్యాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈనెల 15వ తేదీ సాయంత్రం గడ్డి కోసం పొలం వద్దకు వెళ్లిన దళిత వృద్ధ మహిళ లక్ష్మమ్మ (65)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దాట్ల అమర్నాథ్ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలి వెనుక నుంచి వచ్చిన అమర్నాథ్ ఆమెను గడ్డి మోపు కిందికి నెట్టేసి అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లక్ష్మమ్మ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మరో వ్యక్తి అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మమ్మ ఈనెల 22వ తేదీన మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు, దళిత సంఘాలు ఈనెల 24వ తేదీన పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. నిందితుడు దాట్ల అమర్నాథ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
