ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఒక భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. తన భర్త అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా.. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆ జంట అడ్డంగా దొరికిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌరోజ్‌పుర్ గుర్జర్ గ్రామానికి చెందిన రైతు సచిన్ డాగర్ (34) భార్య రచనకు, అదే ప్రాంతానికి చెందిన సోను అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, రచన, సోనుల వ్యవహారంపై సచిన్‌కు అనుమానం రావడంతో, అతను తన భార్యను పలుమార్లు మందలించాడు. దీనితో వారిద్దరికీ నిత్యం గొడవలు మొదలయ్యాయి. తన ప్రియుడితో కలిసి హాయిగా గడపాలనే ఉద్దేశంతో, భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని రచన పక్కాగా స్కెచ్ వేసింది.
పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి భర్త సచిన్ తిన్న ఆహారంలో రచన బలవంతంగా నిద్రమాత్రలు కలిపింది. సచిన్ గాఢనిద్రలోకి వెళ్లిన తర్వాత, తన ప్రియుడు సోనును ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి సచిన్ గొంతును గట్టిగా నులిమి హత్య చేశారు. ఆ తర్వాత, సచిన్ అనారోగ్యంతో చనిపోయాడని ఊరి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, మృతుడి మెడపై ఉన్న గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. శుక్రవారం రాత్రి సోను సచిన్ ఇంట్లోకి వెళ్లడం, శనివారం తెల్లవారుజామున బయటకు రావడం రికార్డైంది. దీంతో పోలీసుల అదుపులోకి తీసుకున్న రచనను గట్టిగా విచారించగా, చివరకు ఆమె నేరాన్ని అంగీకరించింది. నిద్రమాత్రలు తినిపించి ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం రచన, ఆమె ప్రియుడు సోనును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
