సంగారెడ్డి జిల్లా బాచేపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచేపల్లి శివారు 161 జాతీయ రహదారిపై తూఫాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. మహారాష్ట్రలోని డేగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరో 19 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మృతుల్లో వాహన డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు ఉన్నారు.
డెంగ్లూరు నుంచి బయలుదేరిన తుఫాను వాహనం బాచేపల్లి వద్ద ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టడంతో ఈ ఘటనలో డ్రైవర్, ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. క్షతగాత్రులను వైద్యం కోసం నారాయణ్‌ఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
