దుబ్బాకలో బీజేపీ జెండ ఎగిరింది..!

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికలో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ  21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజీపీ గెలుపును కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.

నువ్వా-నేనా అన్నట్లు సాగిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో బిజేపి అనుహ్య విజయం సాధించింది. రౌండ్‌ రౌండ్‌కి ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌ను తలపించేలా ఫలితాలు వెలువడ్డాయి. హోరాహోరీ పోరులో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. 23 రౌండ్లుగా వెలువడిన ఫలితాల్లో ముందు ఐదు రౌండ్లలోనూ బిజేపి అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం ప్రదర్శించారు.

ఆ తర్వాత టిఆర్ఎస్ కొద్దిగా పుంజుకుంది. అయినా బిజేపినే ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత వరుస రౌండ్లలో గులాబీ సత్తా చాటింది. అయితే ఆధిక్యాలు భారీ స్థాయిలో చేజిక్కుంచుకోలేకపోయింది.

బిజేపి అభ్యర్థికి కొన్ని రౌండ్లలో వెయ్యికి పైగా ఆధిక్యాలు దక్కాయి. టిఆర్ఎస్ కి మాత్రం ఏ రౌండ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధిక్యాలు రాలేదు. ప్రతి రౌండ్‌లోనూ కేవలం వందల్లోనే మెజార్టీల్లో తేడాలు వచ్చాయి. చివరి నాలుగు రౌండ్లలో కమలదళం సత్తా చాటింది. బిజేపి అభ్యర్థి రఘునందన్‌రావు విజయదుందుబి మోగించారు. ఉపఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి చవిచూసింది.