Sunday, May 19, 2024
- Advertisement -

రాజుగారి కోటలో రాజుకున్న చిచ్చు

- Advertisement -

బొబ్బిలి యుద్ధం మళ్లీ మొదలైంది. ఈ సారి ఇంటిపోరుతో బొబ్బిలి కోటలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున శంభంగి గెలుపు ఖాయమనే వార్తలు ఇప్పటికే నియోజకవర్గం అంతటా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ? బొబ్బిలి కోటలో ఏం జరుగుతోంది ? శంభంగికి కలసి వస్తున్న అంశాలేంటి ? ఆద్యా మీడియా గ్రౌండ్ రిపోర్ట్ లో వెలుగు చూసిన ఆసక్తికరమైన అంశాలేంటో ఓ సారి చూద్దాం.

రహదారులకే దిక్కులేదు

గత సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత స్వప్రయోజనాల కోసం, మంత్రి పదవి కోసం ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైఎస్ఆర్ సీపీ జెండా. అజెండాతో గెలిచి, పార్టీ ఫిరాయించి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పోనీ పార్టీ మారాక, మంత్రి పదవి దక్కించుకున్నాక అయినా, పని చేశారా ? నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారా ? అంటే.. అదీ లేదనే తెలుస్తోంది. మంత్రిగా ఉన్నా సరే నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా చేయించుకోవడంలో సుజయ్ కృష్ణరంగారావు విఫలమయ్యారు. బొబ్బిలి, సాలూరు మధ్య మోసూరువలస, చిన బోరబంద, పెద బోరబంద, రామన్నదొరవలస, బుచ్చింపేట సహా దాదాపు 12 గ్రామాల్లోని 20 వేల మందికి పైగా ఉపయోగపడే రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయించలేకపోయారు. మరోవైపు రామభద్రపురం కొండకెంగువ మధ్య రహదారి వేయడంలో కూడా మంత్రిగారు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ఆ ప్రాంతంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. వాళ్లంతా ఇటీవల గ్రామ పర్యటనకు వెళ్లిన మంత్రిని అడ్డుకున్నారు. రహదారి కూడా వేయలేని మంత్రి పదవి ఎందుకంటూ నిలదీశారు.

జూట్ మిల్లుల మూతతో కార్మికుల పస్తులు

మరోవైపు నియోజకవర్గంలోని జ్యోతి, శ్రీనివాస్ జూట్ మిల్లులు గత రెండేళ్లకు పైగా మూతపడ్డాయి. దాదాపు 7 వేలమంది ప్రత్యక్షంగా, వారి కుటుంబీకులు మరో 15వేల మంది పరోక్షంగా ఆ జూట్ మిల్లుల మీదే ఆధారపడి జీవనం సాగించేవారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి దక్కించుకున్నాక సమస్య పరిష్కరించి, మిల్లులు తెరిపిస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే ఎదురైంది. దీంతో కార్మికులు, వారి కుటుంబీకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి రాజులకు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిగా సుజయ్ కృష్ణ విఫలమయ్యారనే విమర్శలు పెరిగిపోయాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సుజయ్ ను ఈ సారి పక్కన పెట్టాలనే ఆలోచన నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. ప్రజల అసంతృప్తిని గమనించిన రాజులు ఈ సారి రంగారావు సోదరుడు బేబీనయనను బొబ్బిలి ఎమ్మెల్యేగా బరిలో దించాలని పావులు కదుపుతోంది. రంగారావును ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది.

నవరత్నాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి

మంత్రి రంగారావు పనితీరుపై నియోజకవర్గంలో అసంతృప్తి పెరగడంతో దాన్ని పూర్తిగా తనకు సానుకూలంగా మలుచుకుంటున్నారు వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా సేవలందించిన శంభంగి ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ తరఫున నియోజకవర్గంలో చురుగ్గా పని చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 70 శాతం వరకూ ప్రచారం పూర్తి చేసేశారు. అన్ని సామాజికవర్గాలనూ కలుపుకుంటూ పోతున్న శంభంగికి ఈ సారి సొంత సామాజికవర్గమైన కొప్పలవెలమ పూర్తి అండదండలు అందిస్తోంది. ఎలాగైనా శంభంగిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించేందుకు తామంతా కృషి చేస్తున్నామని, ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఇంటింటికీ నవరత్నాలను పరిచయం చేస్తూ శంభంగి చురుగ్గా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 70 శాతం గ్రామాలను, ఇళ్లను, కవర్ చేసిన ఆయన త్వరలోనే 100 శాతం పూర్తిచేయాలని ప్లాన్ చేసుకున్నారు. తనను ఎమ్మెల్యేగా, జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఇంటింటికీ తిరిగి మరీ కోరుతున్నారు. జగన్ సీఎం అయితే నవరత్నాలు పథకాలతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తానని శంభంగి కోరుతున్నారు. ఇక ఆయన మొర ఆలకిస్తున్న ఓటరు దేవుడు కరుణిస్తే, బొబ్బిలి కోటపై శంభంగి వెంకట చిన అప్పలనాయుడు జెండా ఎగురేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -