Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగు సీఎంలకు ముందస్తు భయం

- Advertisement -

నరేంద్రమోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోందా ? త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందా ? అలా అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలకు ముందస్తు తప్పదా ? అనే అనుమానాలు దాదాపు తొలగిపోయినట్లే. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్లాలని మొదట కేసీఆర్ భావించారు. కానీ తాజాగా ఆయన ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ముందస్తుతో లాభం లేదని పార్టీ శ్రేణులకు ఆయన తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఆరు నెలలు ఉన్నా ఇప్పటి నుంచే పార్టీ నాయకులు పూర్తి స్థాయి దృష్టి పెట్టి కష్టపడాలని ఆదేశించారు. వచ్చే సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారులో బహిరంగ సభ ద్వారా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆ సభ నుంచి సమరశంఖం పూరించి ఎన్నికల వేడి పుట్టించాలని గులాబీ బాస్ ఆలోచన. కేంద్రం ఒక వేళ పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలు ముందస్తుగా జరిపించాలని భావిస్తే, అందుకు తమ పార్టీ, ఎంపీ అభ్యర్ధులు సిద్ధమేనని టీఆర్ఎస్ చెబుతోంది. కానీ గతంలో ముందస్తు వస్తే అసెంబ్లీని రద్దు చేసుకుని, ఎన్నికలకు వెళ్తాం. అనే మాట మాత్రం చెప్పడం లేదు.

ఇక ఏపీలో చంద్రబాబు మొదట్నించీ ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. మాకు ప్రజలు ఐదేళ్లు పాలించే అధికారం ఇచ్చారు. కనుక పూర్తికాలం ప్రజాసేవ చేసుకుంటాం. ముందస్తుకు వెళ్లం. మోడీ ప్రభుత్వం పార్లమెంట్ రద్దు చేసుకుని, ఎన్నికలకు వెళ్తే వెళ్లనీ, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని, ముందస్తుకు వెళ్లమని కోరే హక్కు, అధికారం వారికి లేదు. అని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పటి నుంచే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు ప్రకటిస్తున్నారు.

వాస్తవానికి ఇద్దరు చంద్రుల భయం ఒకటే. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. ఆ వ్యతిరేకతను పూర్తిగా తొలగించుకోలేకపోయినా…అధికారంలో ఉండే ఈ ఆరు నెలల్లో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత తొలగించుకోవాలన్నదే వారి తాపత్రయం.

దానికి తోడు అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్తే అధికార యంత్రాంగం అంతా తమ చెప్పుచేతల్లో ఉంటుంది. అంతేకాని ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వీటికి తోడు మరో ప్రధాన కారణం సెంటిమెంట్. గతంలో ముందస్తుకు వెళ్లిన సందర్భాల్లో ఎక్కువసార్లు అధికార పార్టీ ఓటమి పాలయిన సంఘటనలే చరిత్రలో కనిపిస్తున్నాయి. 1983లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లి పరాజయం పాలైంది. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లి ఓటమిని ముూటగట్టుకుంది. 2003 నవంబర్ లో చంద్రబాబు తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్లినా, ఈసీ 2004లోనే ఎన్నికలు నిర్వహించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఈ మూడు సందర్భాల్లోనూ ముందస్తుకు వెళ్లిన ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీలు ఓటమి చవిచూశాయి. కేంద్రప్రభుత్వాలు విషయానికి వస్తే 1969లో ఇందిరాగాంధీ, 1984లో రాజీవ్ గాంధీ ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. 2004లో వాజ్ పేయ్ సర్కార్ ముందస్తుకు వెళ్లి ఓడిపోయింది. 84లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికలు కనుక సెంటిమెంట్ పని చేసి రాజీవ్ గాంధీ వ్యూహం ఫలించింది. ఇక 69లో ఇందిరాగాంధీ ముందస్తుకు వెళ్లినా, ఎన్నికలు మాత్రం ఏడాది తర్వాత జరిగాయి. దీంతో ఆలోగా సమీకరణాలు మారిపోయి, ఆమెకు విజయం దక్కింది. కానీ మిగిలిన సందర్భాల్లో కేవలం మూడు, నాలుగైదు, నెలల వ్యత్యాసంలో ముందస్తుకు వెళ్లిన వారికి లబ్ధి కలగలేదు. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే చంద్రబాబునాయుడు, కేసీఆర్ ముందస్తు రాగం వదిలేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -