Friday, May 17, 2024
- Advertisement -

వైఎస్ ఆత్మను జగన్ వదిలేశాడు కేసీఆర్ పట్టేశాడు

- Advertisement -

2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఓ వైపు ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అందులో దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తున్నారు. లూప్ లైనులో ఉండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సారీ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు. హామీల అమలుపై బాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరుగుతున్నారు. తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో పూసగుచ్చినట్లు మరీ విడమరిచి చెబుతున్నారు. వృద్ధులు, వితంతువులు, డ్వాక్రా మహిళలు, రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అగ్రిగోల్డ్ బాధితులు, ఉపాధ్యాయులు ఇలా ఏ వక్క వర్గాన్నీ వదలకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హామీ ఇస్తూ ఓటు బ్యాంక్ పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు.

అంతేకాదు జగన్ ఎవ్వరి మాటా వినడు. ఎంత సీనియర్ నాయకుడు చెప్పినా పట్టించుకోడు. తన మాట తనదే తప్ప, ఇతరుల సలహాలు తలకు ఎక్కించుకోడు. అలా చేసుంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాడు…అని చాలామంది ఆరోపిస్తుంటారు. అయితే అదంతా గతమని, ఈ మధ్య జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని తెలుస్తోంది. తన స్పీచులు ఎలా ఉండాలి ? పబ్లిక్ మీటింగుల్లో తన హావభావాలు ఎలా ఉండాలి ? జనం తన నుంచి ఏం కోరుకుంటున్నారు ? ఏ హామీలు ఇస్తే ఏ వర్గం దగ్గరవుతుంది ? ఇలా అనేక విషయాలను వివిధ వర్గాలు, మార్గాల ద్వారా జగన్ సేకరించుకుంటున్నాడు. గతంతో పోల్చుకుంటే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇదే ఊపులో తన తండ్రికి ఆప్త మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సలహాలు, సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుదనేది చాలామంది అభిప్రాయం. కేవీపీ ప్రస్తుతం తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేవీపీని ఏపీ పబ్లిక్ అఫైర్స్ ముఖ్య సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. వైఎస్ ఆత్మ కేవీపీ అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. అనేక కీలక సమయాల్లో కేవీపీ సలహాలు, ఆయన వ్యూహంతోనే వైఎస్ సమస్యలు పరిష్కరించుకుని, అందర్నీ కలుపుకుని అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తుంటారు. అటువంటి కేవీపీని వైఎస్ మరణం తర్వాత జగన్ ఎందుకో దూరంగా పెట్టారు.

అయితే కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న కేవీపీ, ప్రస్తుతం కేసీఆర్ కి రహస్య మిత్రుడుగా కొనసాగుతున్నారని ఆఫ్ ది రికార్డ్ గా తెలుస్తోంది. కేవీపీ దర్శకత్వంలోనే ఇటీవల దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడు బలపడుతోందని, భావిస్తే అప్పుడు ఆ పార్టీ నుంచి మరిన్ని చేరికలు టీఆర్ఎస్ లో ఉండేలా కేసీఆర్, కేవీపీ వ్యూహరచన కొనసాగింది. వైఎస్ ఉన్నప్పటి నుంచీ తనకు సన్నిహితంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలను సమయం చూసి టీఆర్ఎస్ లో జాయిన్ చేస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వస్తున్న సమాచారం. కేవీపీ దర్శకత్వంలోనే త్వరలో ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గులాబీ గూటిలో వాలిపోతారని తెలుస్తోంది. అయితే బ్యాక్ డోర్ పోల్ టిక్స్ లో కేవీపీ చతురత తెలుసు కనుకే కేసీఆర్ ఆయనను పట్టుకున్నారు. కాంగ్రెస్ ను బలహీన పరిచి, టీఆర్ఎస్ ను బలపరిచేలా వ్యూహరచన చేస్తున్నందుకు కేవీపీకి ఇవ్వాల్సిన తాయిలాలు ఇస్తూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజక్ట్ పనుల కాంట్రాక్ట్ లు కేవీపీ చెప్పిన వారికే కేసీఆర్ ఇచ్చారు. ఆయన కాంట్రాక్టులు ఇస్తుంటే, ఈయన అనుచరులను కీలక నేతలను ఆ పార్టీలోకి పంపుతున్నారు. వీటితో పాటు కేసీఆర్, కేవీపీని కలపిన మరో బలమైన బంధం కులం. అవును ఇద్దరూ వెలమ కులస్తులే కావటంతో కులం మీద అభిమానంతో, కులరాజకీయాలు చేయడం సహజం. మొత్తానికి తెరవెనుక తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా, పేరుబడ్డ వైఎస్ ఆత్మను ఆయన తనయుడు జగన్ వదులుకున్నాడు. కేసీఆర్ మాత్రం అదను చూసి పట్టుకున్నాడు. మరి జగన్ ఇప్పటికైనా తన తండ్రి ఆత్మను ఆశ్రయిస్తాడో ? లేదో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -