Saturday, May 4, 2024
- Advertisement -

బాబును తిట్ట‌కుండా ఉండ‌వ‌ల్లి ఉండ‌గ‌ల‌రా..!

- Advertisement -

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్.. మ‌హా మేథావి. పుస్త‌కాల పురుగు. జ్ఞాన సంప‌న్నుడు. ఏం మాట్లాడినా.. ప‌క్కాగా ఉంటుంది. ఆధారాల‌తో స‌హా ఏ విష‌యంపైనైనా మాట్లాడ‌గ‌ల నేర్ప‌రి. వీట‌న్నింటికీ మించి.. చంద్ర‌బాబునాయుడిపై విరుచుకుప‌డుతుంటాడు. అదీకూడా.. అలా ఇలా కాదు.. తెలుగుదేశం ప్ర‌భుత్వం, చంద్ర‌బాబునాయుడి తీరు, వ్య‌క్తిత్వాన్ని సైతం.. ఉతికి ఆరేస్తుంటాడు. అలాంటి ఉండ‌వ‌ల్లి అక‌స్మాత్తుగా.. చంద్ర‌బాబునాయుడితో న‌వ్వుతూ ప్ర‌త్య‌క్ష మ‌య్యాడు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వ‌చ్చి చ‌ద్ర‌బాబుతో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపాడు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాజ‌కీయంగా ఇంత‌కంటే ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టం మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీని వీడిన త‌ర్వాత తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ.. ఉండ‌వ‌ల్లి గ‌త కొంత‌కాలంగా చెప్పుకొస్తున్నారు. ఖాళీగా ఉండ‌డం ఎందుక‌ని.. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు.

ఒక‌ద‌శ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ఉండ‌వ‌ల్లిని ఆహ్వానించి.. తాను ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ క‌మిటీలో కీల‌క స‌భ్యుడిగా చేర్చుకున్నాడు. దీంతో ఉండ‌వ‌ల్లి జ‌న‌సేనలో చేరి ఆ పార్టీ రాజ‌కీయ స‌ల‌హాదారుగా మార‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఈ విష‌యాన్ని ఉండ‌వ‌ల్లి ఎక్క‌డా స్ప‌ష్టం చేయ‌లేదు. ప‌వ‌న్ పిలిచాడు.. వెళ్లాను.. అంతే అంత‌కుమించి ఇంకేం లేదంటూ తేలిక‌గా కొట్టిపారేశారు. అలాంటి ఉండ‌వ‌ల్లి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర‌బోతున్నార‌ని, రాజ‌మండ్రి ఎంపీ స్థానం ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఖ‌రారు చేయ‌బోతున్న‌ట్టు కొద్ది కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబుతో సుదీర్ఘ మంత‌నాలు జ‌ర‌ప‌డం ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తోంది.

చంద్ర‌బాబుతో స‌మావేశం అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉండ‌వ‌ల్లి మాత్రం అదేం లేదని కొట్టిప‌డేశారు. తాను ఏ పార్టీలో చేర‌బోనంటూ స్ప‌ష్టం చేశారు. కేవ‌లం రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై తన ద‌గ్గ‌రున్న ఆధారాలను ముఖ్య‌మంత్రికి ఇటీవ‌ల పంపించాన‌ని, వాటిని ప‌రిశీలించిన చంద్ర‌బాబు త‌న‌ను ర‌మ్మ‌ని క‌బురు పెట్ట‌డంతో వ‌చ్చాన‌న్నారు. అంత‌సేపు ఏం చ‌ర్చించారంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎలా పోరాటం చేయాలి, విభ‌జ‌న హామీల అమ‌లు వంటి విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్టు వెళ్ల‌డించారు. రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారని ఈ విషయమై తాను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశానంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారని, ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కి గుర్తుచేశాన‌ని, వాటిని పార్లమెంటులో ప్రస్తావించాలని కోరాన‌ని ఉండ‌వ‌ల్లి వెళ్ల‌డించారు.

అయితే ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబు మ‌ధ్య ఈ విష‌యాల‌తో పాటూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావం వంటి విష‌యాలు సైతం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఇదే సంద‌ర్భంలో ఉండ‌వ‌ల్లిని తెలుగుదేశం పార్టీలోనికి చంద్ర‌బాబు ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. ఉండ‌వ‌ల్లికి ఆయ‌న సొంత ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌మండ్రి స్థానం ఇచ్చి.. అక్క‌డి నుంచి ప్ర‌స్తుతం సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న ముర‌ళీమోహ‌న్‌ను మ‌రోచోటికి మార్చేందుకు చంద్ర‌బాబు ఆస‌క్తిగా ఉన్నార‌నే వార్త‌లొస్తున్నాయి. ఉండ‌వ‌ల్లికి రాజ‌మండ్రి ఎంపీ స్థానంపై మంచి ప‌ట్టుంది. 2004, 2009లో రెండుసార్లు ఎంపీగా రాజ‌మండ్రి నుంచి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ర్ట విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌లేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌, బీజేపీ, జ‌న‌సేన వంటి పార్టీలు ఉండ‌వ‌ల్లి కోసం త‌లుపులు తెరిచి ఉంచాయి. ఒక‌వేళ ఉండ‌వ‌ల్లి రాజ‌మండ్రి నుంచి ఏ పార్టీ నుంచి బ‌రిలోకి దిగినా విజ‌యావ‌కాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే.. చంద్ర‌బాబు కూడా ఉండ‌వ‌ల్లిని పార్టీలోనికి చేర్చుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ తెలుగుదేశం పార్టీలోనికి వ‌స్తే.. పొద్ద‌స్త‌మానం బాబును తిట్ట‌డంతోనే కాల‌క్షేపం చేసే ఉండ‌వ‌ల్లి.. అది చేయ‌కుండా ఉండ‌గ‌ల‌రా.. అనేది ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్థ‌కం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -