Friday, May 17, 2024
- Advertisement -

వైఎస్ఆర్ సీపీలో ఒంగోలు గిత్త ఎవరు ?

- Advertisement -

ఇటీవల వైఎస్ఆర్ సీపీ తీర్ధం పుచ్చుకున్న ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒంగోలుకు చెందినవారే. దీంతో జగన్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రిత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఒంగోలు అసెంబ్లీ స్థానమే తనకు సేఫ్ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టు నియోజకవర్గ ప్రజలకు టచ్ లో ఉంటూ, తన పని తాను చేసుకుపోతున్నారు. సాంబశివరావుకు ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇస్తామంటే కచ్చితంగా బాలినేని వ్యతిరేకిస్తారు. ఒకవేళ ఆయనకు జిల్లాలో వేరే అసెంబ్లీ స్థానం నుంచి, లేదా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరినా అందుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. బాలినేని ఒంగోలు అసెంబ్లీ టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడితే…సాంబశివరావుని ఒంగోలు ఎంపీగా నిలిపే అవకాశముంది.

కానీ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి కూడా వైఎస్ఆర్ సీపీ నుంచి తీవ్ర పోటీ కనిపిస్తోంది. చాలా రోజులుగా స్తబ్ధుగా ఉన్న వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈ సారి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒంగోలు ఎంపీ లేదంటే రాజంపేట ఎంపీ స్థానం కోసం పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఒంగోలు, రాజంపేట ఈ రెండు ఎంపీ స్థానాల్లో ఏదో ఒక దగ్గర నుంచి కచ్చితంగా షర్మిల పోటీ చేస్తారనే పార్టీలోని ఆమె వర్గీయులు చెబుతున్నమాట. అదే జరిగితే ప్రస్తుత ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సిందే. ఆయనను అద్దంకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట్నించి షర్మిల వైపు మొగ్గుచూపే వైవి సుబ్బారెడ్డి తన ఒంగోలు ఎంపీ స్థానం ఆమెకివ్వడానికైతే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని, సంతోషంగా త్యాగం చేసి, తాను అద్దంకి బస్సు ఎక్కడం ఖాయమంటున్నారు. షర్మిల కాకుండా బాలినేని, సాంబశివరావు అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారనేది ఆయన వర్గీయుల మాట. మొత్తానికి ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఒకేపార్టీ నుంచి ఇంతమంది బలమైన అభ్యర్ధులు పావులు కదుపుతుండటం విశేషం. మరి చివరికి వైఎస్ఆర్ సీపీ నుంచి బరిలో నిలిచే ఒంగోలు గిత్త ఎవరో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -