Thursday, May 16, 2024
- Advertisement -

అద్దాల మేడల సినీజీవికి ఉన్న ధైర్యం కూడా జర్నలిస్టులకు, సామాన్యులకు లేదా? ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యక్తిత్వం గెలుస్తోందా?

- Advertisement -

మామూలుగా అయితే అద్దాల మేడల్లో ఉండేవాళ్ళు పోరాటానికి జడుస్తారు. ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ చెప్పాలంటే కోటీశ్వరులకు బోలెడన్ని భయాలు ఉంటాయి. ఇక సినిమా వాళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు. పాలకులు, నాయకులు, వీధి రౌడీలు, మహిళా సంఘాలు, జర్నలిస్టులు…… ఎవరికి కోపం వచ్చినా సినిమావాడిని, సినిమాలను ఓ స్థాయిలో ఏకిపడేస్తూ ఉంటారు. అసలే పాకుడు రాళ్ళు లాంటి సినిమా జీవితాలను మరికాస్త ఎక్కువగా తల్లకిందులయ్యేలా చేస్తూ ఉంటారు. అయితే అదంతా గత చరిత్రగా మిగిలిపోయే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మామూలుగా అయితే మన సినిమాల్లో బీభత్సమైన హీరోయిజం ఉంటుంది. గొప్ప గొప్ప క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేస్తారు. కానీ ఆయా సినిమాలకు వర్క్ చేసేటప్పుడు, హీరోల దగ్గర మాత్రం అస్సలు వ్యక్తిత్వం లేనివాళ్ళలాగా ఉండేవాళ్ళు గతకాలపు సినిమా జీవులు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కొత్త డైరెక్టర్స్‌లో ఎక్కువ మంది ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి సిద్ధంగా లేరు. అవసరమైతే స్టార్ హీరోలను వదిలేసి చిన్న హీరోలతోనే హిట్స్ కొట్టి ఆయా స్టార్ హీరోలనే తమ వద్దకు తెచ్చుకుంటున్నారు. అలాగే టెక్నీషియన్స్ కూడా ఆత్మాభిమానం దెబ్బతింటే అస్సలు ఒప్పుకోవడం లేదు. లెజెండ్ ప్రెస్ మీట్‌లో దేవిశ్రప్రసాద్-బోయపాటి శ్రీను మధ్య గొడవకు కూడా ప్రధాన కారణం అదే. ఆ తర్వాత బోయపాటినే ఒక మెట్టుదిగి దేవిశ్రీకి సారీ చెప్పాల్సి వచ్చింది.

సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి చిన్న విషయానికీ సినిమాలపైన విరుచుకుపడిపోయే వాళ్ళ విషయంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు చాలా ధైర్యంగా స్పందిస్తున్నారు. సెన్సార్ అయ్యి బయటకు వచ్చిన సినిమాను మనోభావాల పేరుతో బ్యాన్ చేయాలని చెప్పి థియేటర్స్ దగ్గర, టివి స్టూడియోల్లో హంగామా చేసేవాళ్ళను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ జనాలు అస్సలు కేర్ చెయ్యడం లేదు. రీసెంట్‌గా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విషయంలో ఎంతమంది ఎన్ని వివాదాలు రేేకెత్తించినా, గొడవలు చేసినా చిన్న సినిమా మేకర్స్ అయిన ఆ టీం మెంబర్స్ ఎవ్వరూ కూడా వెనక్కితగ్గింది లేదు. అలాగే తమిళ మెర్సల్ సినిమా విషయంలో కూడా జాతీయ స్థాయిలో సూపర్ పవర్‌గా ఉన్న నరేంద్రమోడీ పార్టీ బిజెపిని కూడా ఆ సినిమా మేకర్స్ ఎదిరించి నిలబడ్డారు.

ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు నంది అవార్డ్స్ అన్నీ కూడా టిడిపి భజన పరులకు ఇవ్వడాన్ని సినిమా ఇండస్ట్రీ జనాలు పూర్తిగా తప్పు పడుతున్నారు. చంద్రబాబు నియంతృత్వ ధోరణి, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌కి జడిసి సీనియర్ ఐపిఎస్‌లే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడరు. అలాంటిది ఈ సారి సినిమా జనాలు మాత్రం బాబయ్య, బాలయ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఒక కులం జనాల ఆధిపత్యం కాస్త ఎక్కువ అన్న విషయం తెలిసి కూడా, ఎక్కడ అవకాశాలు రావో అన్న భయం లేకుండా అధికారంలో ఉన్న టిడిపికి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆ పార్టీ భజన పరులకు వ్యతిరేకంగా మాట్లాడడం గొప్ప విషయమే.

నిజానికి సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా లాంటి విషయాల్లో కూడా పోరాడడానికి సినిమా జనాలు ముందుకు వచ్చారు. కానీ చంద్రబాబు మేనేజ్‌మెంట్ దెబ్బకు సైలెంట్ అయ్యారు. అయితే ఆ పోరాటం స్ఫూర్తి మాత్రం ఇండస్ట్రీ జనాల్లో నిలబడిపోయింది. సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని సహించకూడదు అన్న ఆలోచనలో ఇండస్ట్రీ జనాలు ఉన్నారు. టిడిపి భజనపరుల విషయం పక్కన పెడితే ఎక్కువ మంది సినిమా జనాలు, అది కూడా ప్రతిభతోనే నిలబడదాం అనుకునేవాళ్ళు మాత్రం ధైర్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ మాత్రం ధైర్యం జర్నలిస్టులు, మీడియా సంస్థల అధినేతలకు లేకపోవడం గమనార్హం. టిడిపి అధినేత చంద్రబాబు అండ్ కో తెచ్చిన ఒత్తిడికి తట్టుకోలేక ఎన్టీవీ యాజమాన్యం కొమ్మినేని శ్రీనివాసరావులాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్‌ని అవమానకరంగా ఉద్యోగంలో నుంచి తప్పించింది. ఇంకా ఎన్నో మీడియా సంస్థలు అధికారంలో ఉన్నవాళ్ళకు సాగిలపడుతున్నాయి. భజనకు బాగా అలవాటు పడిపోయిన జర్నలిస్టుల్లో, మీడియా సంస్థల అధినేతల ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం లేదు కానీ సామాన్యుల్లో మాత్రం ప్రశ్నించే తత్వం పెరిగితే సమాజంలో చాలా మార్పులే వస్తాయి. మరీ ముఖ్యంగా తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నామన్న స్పృహ లేకుండా సమాజాన్ని నాశనం చేస్తున్న రాజకీయ నాయకుల్లో కాస్తైనా భయం కలగడానికి మాత్రం సామాన్యుడి ధైర్యం ఆయుధంగా ఉపయోగపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -