సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో సంచలనం సృష్టించిన మీనాదేవి అనుమానాస్పద హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారంటూ మొదట పోలీసులకు ఫిర్యాదు చేసిన కట్టుకున్న భర్తే.. పరాయి ముఠాకు సుపారీ ఇచ్చి భార్యను గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన సూత్రధారి భర్త అనిల్ కుమార్‌తో పాటు అతనికి సహకరించిన మరో నిందితుడిని బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ ఇక్కడ లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ.. పాత వాహనాలు కొనుగోలు చేసి అమ్ముతూ మంచిగానే సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా భార్య మీనాదేవితో అతనికి తీవ్రమైన విభేదాలు, కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పగ పెంచుకున్న అనిల్.. భార్యను అంతమొందించడానికి తన సొంత రాష్ట్రమైన బీహార్‌కు చెందిన నలుగురు కిరాతక వ్యక్తులతో మాట్లాడి భారీ మొత్తానికి సుపారీ (Supari) ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ పక్కా ప్లాన్ ప్రకారం గత నెల 30వ తేదీ ఉదయం అనిల్ కుమార్ తన భార్య మీనాదేవిని వెంటబెట్టుకుని మార్కెట్‌కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బొల్లారం సమీపంలోకి రాగానే ముందే అనుకున్నట్లుగా తన బైక్ రిపేర్ అయిందంటూ అనిల్ నమ్మబలికాడు. రోడ్డు పక్కన బైక్ ఆపి నాటకమాడుతుండగా.. అప్పటికే అక్కడ పొదల్లో మాటు వేసి ఉన్న ముగ్గురు సుపారీ హంతకులు ఒక్కసారిగా మీనాదేవిపై దాడి చేశారు. ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న నిర్మానుష్య పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి కిరాతకంగా హతమార్చారు. హత్య ముగిసిన తర్వాత అనిల్ కుమార్ ఏమీ ఎరగనట్లు నటించాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్యను అటాక్ చేసి చంపేశారంటూ బొల్లారం పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేశాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు భర్త అనిల్ కుమార్ ప్రవర్తనపై గట్టి అనుమానం వచ్చింది. టెక్నికల్ ఆధారాలు, కాల్ డేటా సహాయంతో అతని శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. కుటుంబ గొడవల వల్లే బీహార్ ముఠాతో ఈ దారుణ హత్య చేయించినట్లు అనిల్ కుమార్ అంగీకరించాడు. ఈ కేసులో భర్త అనిల్ కుమార్‌తో పాటు హత్యకు ప్లాన్ వేసిన మరో స్థానిక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. ప్రస్తుతం పరారీలో ఉన్న బీహార్‌కు చెందిన ముగ్గురు ప్రధాన హంతకుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
