హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5.30 గంటలకు టీజీ20 (TG20) క్రికెట్ లీగ్‌కు ఘనంగా శ్రీకారం చుట్టనున్నట్లు టీజీ20 గవర్నింగ్ బాడీ చైర్మన్ ఆఘమరావు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. అలాగే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరుకానుండగా, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు.
లీగ్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు, 160 మంది ఆటగాళ్లు పాల్గొంటుండగా, మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రేపు జరిగే తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు, పాలమూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయని ఆఘమరావు తెలిపారు. టోర్నీ విజేతకు రూ.1 కోటి నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
అయితే లీగ్ నిర్వహణను అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మాజీ హెచ్‌సీఏ కార్యదర్శి శేషు నారాయణ ఆరోపించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) పేరుతో టీజీ20 లీగ్‌ను నిలిపివేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. హెచ్‌సీఏ అంతర్గత వ్యవహారాల్లో గురువారెడ్డి జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
బీసీసీఐని సవాల్ చేసే స్థాయిలో టీసీఏ వ్యవహరిస్తోందా అంటూ శేషు నారాయణ నిలదీశారు. కొందరు క్రికెటర్లతో కోర్టుల్లో కేసులు వేయించి లీగ్‌కు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్ని అడ్డంకులను అధిగమించి టీజీ20 లీగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
