పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి అనంతవాణి (32) అనే యువతిని శ్యామ్‌బాబు అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడు కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్. అనంతవాణి హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోం పని చేస్తోంది.
తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఆ సమయంలో శ్యామ్‌బాబుతో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. శ్యామ్‌బాబుకు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలియడంతో అనంతవాణి అతడిని దూరం పెట్టింది. దీనితో తనను కాదన్న ఆవేదనతో శ్యామ్‌బాబు ఆమెపై పగ పెంచుకున్నాడు.
ఆదివారం తెల్లవారుజామున శ్యామ్‌బాబు అనంతవాణి ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టి ఆమెను బయటకు రప్పించాడు. అప్రమత్తం అయ్యేలోపే పదునైన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అనంతవాణిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. నిందితుడు దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏఎస్సై వైవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతవాణి తండ్రి దివ్యాంగుడు కాగా తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. కుటుంబానికి ఆమె ఒక్కతే ఆధారం. బ్యాంకు రుణం చేసి ఇల్లు నిర్మించుకున్న అనంతవాణి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. దాడి జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నా అడ్డుకునే స్థితిలో లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
