- Advertisement -

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి.. రెండు రోజుల్లోనే..

- Advertisement -

ప్రముఖ నటుడు దిల్జిత్ దొసాంజే నటించిన ‘సత్లుజ్’ చిత్రం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సుమారు నాలుగేళ్ల వివాదం తర్వాత ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైన ఈ సినిమా కేవలం 48 గంటల్లోనే స్ట్రీమింగ్ నుంచి తొలగిపోయింది. ఈ పరిణామం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1990లలో పంజాబ్‌లో వేలాది మంది అదృశ్యమైన ఉదంతాలపై జస్వంత్ సింగ్ జరిపిన పరిశోధనలను ఇందులో చూపించారు. దర్శకుడు హనీ ట్రెహన్ ఈ సినిమాను తొలుత ‘ఘల్లుఘరా’ పేరుతో ప్రకటించారు. ఆ తర్వాత ‘పంజాబ్ 95’గా పేరు మార్చారు. చివరకు ఓటీటీలోకి వచ్చేసరికి ‘సత్లుజ్’ పేరుతో విడుదల చేశారు.

ఈ సినిమా 2022లోనే పూర్తయినప్పటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో విడుదల ఆలస్యమైంది. రక్తపాతం దృశ్యాలు అలాగే అభ్యంతరకర సంభాషణల కారణంగా సెన్సార్ బోర్డు వందకు పైగా కట్స్‌ సూచించింది. కథ దెబ్బతింటుందని భావించిన చిత్రబృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మూడేళ్లకు పైగా జరిగిన ఈ సెన్సార్ వివాదం తర్వాత జులై 3న జీ5 ఓటీటీ వేదికగా సినిమా విడుదలైంది. ఎటువంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షన్ విడుదల చేయడంపై దిల్జిత్ దొసాంజే సంతోషం వ్యక్తం చేశారు.

అయితే విడుదలైన రెండు రోజుల్లోనే భారత్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిచిపోయింది. ప్రస్తుత పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని, మళ్ళీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిపింది. తొలగింపుకు గల కచ్చితమైన కారణాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. అమెరికా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల్లో ఈ చిత్రం ఇప్పటికీ అందుబాటులో ఉండటం విశేషం. స్వదేశంలో నిలిపివేత వెనుక గల కారణాలు తెలియక అభిమానులు అయోమయంలో ఉన్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -