తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా తనకు తీవ్ర అవమానం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నేత నారాయణ స్వామి ఆరోపించారు. ప్రోటోకాల్‌కు అర్హుడైనప్పటికీ తనకు ప్రత్యేక దర్శనం కల్పించకుండా సాధారణ భక్తుల మాదిరిగానే జనరల్ దర్శనానికి పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు రావాల్సిన ప్రోటోకాల్‌ను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఆరోపించిన నారాయణ స్వామి, తిరుమలలో వైఎస్సార్సీపీ నాయకుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రాజకీయ కారణాలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
అయితే, దేవుడి ముందు అందరూ సమానమేనని తాను నమ్ముతానని పేర్కొన్న నారాయణ స్వామి, ఆలయ పరిసరాల్లో మానవత్వానికి ప్రాధాన్యం తగ్గిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
తిరుమలలో ప్రస్తుతం అమలవుతున్న వీఐపీ దర్శన విధానంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తిగా వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఎవరికైనా అవమానం జరిగే పరిస్థితులు తలెత్తకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి, జరిగిన విషయంపై విచారణ జరిపించాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలకు తావు లేకుండా సమానత్వం, పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
