- Advertisement -

కుమార్తెలను వేధించాడని.. యువకుడిని దారుణంగా..

- Advertisement -

హైదరాబాద్ మాదాపూర్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇద్దరు కుమార్తెలను వేధింపులకు గురిచేస్తున్నాడనే కోపంతో, ఒక తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కిరాతకంగా చంపేశాడు. మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన సినపల్లి భాస్కర్ (32), మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి చెందిన తమ్మడబోయిన రాజుయాదవ్ పెద్ద కుమార్తెతో 2020లో భాస్కర్‌కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో అమ్మాయి తల్లిదండ్రులు పలుమార్లు మందలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లో ఆ యువతికి ప్రభుత్వ ఉద్యోగితో వివాహం జరగగా, భాస్కర్ చాటింగ్ స్క్రీన్‌షాట్లు పంపి దంపతుల మధ్య చిచ్చుపెట్టాడు. చివరికి ఆ దంపతులకు గత నెల 23న విడాకులు మంజూరయ్యాయి. అయితే, ప్రస్తుతం బేగంపేటలో ఉంటున్న తన చెల్లిని కూడా భాస్కర్ వేధించడం, ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేయడంతో రాజుయాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

భాస్కర్‌ను చంపాలని నిర్ణయించుకున్న రాజుయాదవ్, మంగళవారం రాత్రి తన బావమరిది కుమారస్వామితో కలిసి మరో ముగ్గురితో హోటల్‌కు చేరుకున్నాడు. భాస్కర్‌ను బయటకు రప్పించి, కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, రాజుయాదవ్, కుమారస్వామిలను అరెస్టు చేశారు. నిందితులపై హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, మృతుడి సోదరుడి కథనం భిన్నంగా ఉంది. యువతి, భాస్కర్ ప్రేమించుకున్నారని, ఆమె విడాకులు తీసుకున్న తర్వాత బుధవారం గుడిలో పెళ్లి చేసుకోవాలని భావించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ హత్యకు సంబంధించి మిగిలిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -