- Advertisement -

వన్డే, టీ20 ప్రపంచకప్‌లకు కొత్త ఫార్మాట్

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పురుషుల వన్డే ప్రపంచకప్ మరియు టీ20 ప్రపంచకప్ టోర్నీల ఫార్మాట్‌లో కీలక మార్పులను ప్రకటించింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. టోర్నీలను మరింత పోటీగా, ఆసక్తికరంగా మార్చడం, ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యత పెంచడం, జట్ల మధ్య పోటీ స్థాయిని మెరుగుపరచడం, అభిమానులకు మరింత ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించడమే ఈ మార్పుల లక్ష్యమని ఐసీసీ తెలిపింది.

2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. గత రెండు ఎడిషన్లలో (2019, 2023) 10 జట్లు మాత్రమే పోటీపడగా ఇప్పుడు మళ్లీ 14 జట్ల ఫార్మాట్‌ను తీసుకొస్తున్నారు.కొత్త ఫార్మాట్ ప్రకారం టోర్నీని నాలుగు దశల్లో నిర్వహిస్తారు.

మొదటి దశ: ర్యాంకింగ్స్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు పోటీపడతాయి.ఈ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు రెండో దశకు అర్హత సాధిస్తుంది.

రెండో దశ: ఇప్పటికే అర్హత పొందిన 11 జట్లతో కలిసి మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో 6 జట్లు) విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఒక జట్టు సూపర్-7కు చేరుతుంది.

సూపర్-6 స్థానంలో సూపర్-7

గతంలో ఉన్న సూపర్-6 స్థానంలో ఇప్పుడు సూపర్-7 రౌండ్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ దశలో ఏడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఇప్పటికే గ్రూప్ దశలో ఎదురుపడిన జట్లు మళ్లీ తలపడే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్ నుంచి సూపర్-7కు చేరితే మరోసారి పోటీ పడతాయి.

సూపర్-7లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

1వ స్థానం vs 4వ స్థానం
2వ స్థానం vs 3వ స్థానం

ఈ కొత్త ఫార్మాట్‌తో 2027 ప్రపంచకప్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది గత ఎడిషన్‌తో పోలిస్తే 9 మ్యాచ్‌లు ఎక్కువ.

టీ20 ప్రపంచకప్‌లోనూ భారీ మార్పులు

టీ20 ప్రపంచకప్ ఫార్మాట్‌లో కూడా ఐసీసీ కీలక మార్పులు చేసింది.మొత్తం 20 జట్లను ఐదు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో నాలుగు జట్లు) విభజిస్తారు. గతంలో నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్లు ఉండేవి.ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు తదుపరి దశకు చేరతాయి.

సూపర్-8 స్థానంలో సూపర్-10

ఇప్పటి వరకు అమల్లో ఉన్న సూపర్-8 స్థానంలో ఇకపై సూపర్-10 రౌండ్ ఉంటుంది.

మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో 5 జట్లు) విభజిస్తారు.
ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది.
రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి.
ఈ ఎలిమినేటర్లలో విజేతలైన రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
అనంతరం ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

2028 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించే విధానంలో కూడా ఐసీసీ మార్పులు చేసింది.

స్కాట్లాండ్‌కు యూరప్ రీజినల్ ఫైనల్‌కు నేరుగా ప్రవేశం కల్పించారు. 2026 ప్రపంచకప్‌లో ఆడినప్పటికీ నేరుగా అర్హత పొందని జట్లు గ్లోబల్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది.ఆఫ్రికా, ఆసియా, యూరప్, అమెరికాస్, ఈస్ట్ ఏషియా-పసిఫిక్ ప్రాంతీయ టోర్నీల ద్వారా మిగిలిన జట్లు ఎంపికవుతాయి.ప్రతి ప్రాంతం నుంచి అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో మూడు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.ఇప్పటికే నేరుగా అర్హత పొందిన 12 జట్లతో కలిసి మొత్తం 20 జట్లు 2028 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -