టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ….జగన్ గురించి ప్రజలే సరైన తీర్పు ఇస్తారని అన్నారు.
వైఎస్ జగన్ క్యాన్సర్ గడ్డా.. లేక రాయలసీమలో పుట్టిన రత్నమా.. అనేది రాష్ట్ర ప్రజలనే అడుగుదాం అని సవాల్ విసిరారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే దూరదృష్టి కలిగిన నాయకుడిగా ఆయనను ప్రజలు గుర్తించారని రాచమల్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి అసలు క్యాన్సర్ గడ్డ లోకేష్” అంటూ వ్యాఖ్యానించిన రాచమల్లు ఆయన రాజకీయ వ్యవహారశైలి వల్లే పార్టీ భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు.
త్వరలోనే నీ వల్ల టీడీపీ పూర్తిస్థాయిలో పతనం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకో లోకేష్” అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
