కాకినాడలో జరిగిన జిమ్ ట్రైనర్ కె.సతీష్ రెడ్డి (30) హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పదునైన చెక్క ముక్కతో గొంతులో పలుమార్లు పొడిచి తన భర్తను చంపేశారని మృతుడి భార్య జయశ్రీ ఆరోపించారు. ఈ హత్య వెనుక అసలు సూత్రధారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో బుధవారం తెల్లవారుజామున సతీష్‌రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శుక్రవారం జయశ్రీ ట్రెజరీకాలనీలో విలేకరులతో మాట్లాడి పలు సంచలన విషయాలు బయటపెట్టారు.
నా భర్తను హత్య చేసింది సాయికిరణ్ అయినప్పటికీ, ఆ హత్య చేయించింది మాత్రం కాకినాడ రాగంపేటకు చెందిన కటౌట్ శ్రీను అని జయశ్రీ స్పష్టం చేశారు. కుటుంబ గొడవల నేపథ్యంలో కొంతకాలం కిందటే శ్రీను, అతడి భార్య విడిపోయారు. ఆ మహిళతో తన భర్త సతీష్‌కు స్నేహం ఉంది. ఓసారి సాయికిరణ్ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడగా సతీష్ మందలించారు. దీంతో సతీష్‌పై సాయికిరణ్ తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. వారి స్నేహాన్ని అనుమానిస్తూ కటౌట్ శ్రీను కూడా సతీష్‌పై కక్ష పెంచుకున్నాడని ఆమె తెలిపారు.
గత నెల 7వ తేదీ అర్ధరాత్రి శ్రీను, సాయికిరణ్ తమ ఇంటికి వచ్చారని జయశ్రీ చెప్పారు. తన భార్యతో విడిపోవడానికి సతీషే కారణమని, అతడిని చంపేస్తానని శ్రీను బెదిరించాడని తెలిపారు. తాను గర్భంతో ఉన్నానని, భర్తను ఏం చేయొద్దని కాళ్లవేళ్లా పడినా శ్రీను వినిపించుకోకుండా వెళ్లిపోయాడని కన్నీరుమున్నీరయ్యారు. అతడి పక్కా పథకం ప్రకారమే సాయికిరణ్ మరో ముగ్గురితో కలిసి తన భర్తను హత్య చేశాడని ఆమె ఆరోపించారు.
ఘటన జరిగే సమయంలో నిందితులు సతీష్‌ను కింద పడేసి కాళ్లతో తన్నారని, తలపై చెక్కతో గట్టిగా కొట్టారని జయశ్రీ తెలిపారు. రక్తపుమడుగులో రోడ్డుపై అపస్మారకస్థితిలో పడి ఉన్నా కనికరం లేకుండా పదునైన చెక్క ముక్కతో గొంతులో పలుమార్లు పొడిచి చంపేశారన్నారు. ఆ తర్వాత నిందితులు చేతులతో సైగలు చేస్తూ రోడ్లపైనే నిర్లక్ష్యంగా తిరిగారన్నారు. ఈ దారుణాన్ని కొంతమంది వాహనదారులు చూసినా భయంతో అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారన్నారు.
శవాగారం వద్ద పోలీసులు తనను ప్రశ్నించిన సమయంలో కటౌట్ శ్రీను పేరు చెప్పే ప్రయత్నం చేయగా, పోలీసులు తనను వారించారని జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను ఓ స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుంటాడని అందరికీ తెలుసని, అందుకే పోలీసులు అతడిని కాపాడేందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారిని అరెస్ట్ చేసి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
