ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ ఆదేశించింది.
ఓ రహస్య వీడియో లీక్ వ్యవహారంలో రహ్మత్‌బేగ్‌పై పార్టీ ఈ తీవ్ర చర్యలు తీసుకుంది. ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎ హుస్సేన్ అన్వర్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన నడుచుకున్న తీరు పార్టీ క్రమశిక్షణకు పూర్తిగా భంగం కలిగించే విధంగా ఉందని పార్టీ భావించింది.
దీంతో పార్టీ అధినేత అసాదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు ఆయన్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే కాకుండా, ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని నేరుగా శాసనమండలి చైర్మన్‌కు అందజేయాలని పేర్కొన్నారు.
ఈ వివాదానికి సంబంధించి పాత నేపథ్యం కూడా చర్చనీయాంశమైంది. గతంలోనూ రహ్మత్ బేగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యూహాత్మక రాజకీయాల వల్ల పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంది. స్థానిక సంస్థల రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన అనుసరించిన కొన్ని పద్ధతులు కొద్దికాలంగా పార్టీలో అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన లీకైన వీడియో వ్యవహారం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని ఎంఐఎం ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టం చేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
