వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కాదని, ప్రతి కార్యకర్త కోసం నిలబడాల్సిన సమయమని జగన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలను నాయకులు ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని పిలుపునిచ్చారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. పార్టీ కేడర్ కోసం దాదాపు 14 నుంచి 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం చేశామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో వరుస సమావేశాలు నిర్వహించి వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనే అంశంపై ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, దౌర్జన్యాలు చేసినా కార్యకర్తలకు పార్టీ తరఫున పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ లీగల్ సెల్, సోషల్ మీడియా విభాగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. పోలీసుల వేధింపులను ఎదుర్కొనేందుకు న్యాయపరమైన రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలిస్తేనే భవిష్యత్తులో పార్టీ మరింత బలపడుతుందని జగన్ ఉద్ఘాటించారు.
