పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన తాజా యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ (Toxic movie) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సినిమాను కించపరిచేలా నెగెటివ్ పోస్టులు సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్రబృందం తీవ్రంగా స్పందించింది.
సినిమాకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై బెంగళూరు కోర్టు (Bengaluru court) సీరియస్ అయింది. చిత్రానికి వ్యతిరేకంగా తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘టాక్సిక్’ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) సంస్థతో పాటు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కోర్టు ఈ ఆంక్షలు విధించింది. సినిమాకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలను, కించపరిచే అంశాలను ఏ మీడియా వేదికపై కూడా పోస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం లాంటి పనులు ఎవరూ చేయకూడదని హెచ్చరించింది.
ఈ న్యాయస్థానపు మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 28వ తేదీ వరకు కచ్చితంగా అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. ఈ ఉత్తర్వులను ఎవరూ వేరే ఇతర ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదని సూచించింది. కోర్టు విధించిన షరతులను ఎవరైనా ఉల్లంఘిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ ఆదేశాలను రద్దు చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
