తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కోలాహలం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ.. మహిళలు వైఎస్ జగన్కు రాఖీలు కట్టారు. తమ అన్నా అయిన వైఎస్ జగన్కు రాఖీలు కట్టి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.
తమను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఎల్లప్పుడూ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వారి కుటుంబాల్లో ఎప్పుడూ సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనసారా దీవించారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
