- Advertisement -

కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా!

- Advertisement -

కాకినాడలో కలకలం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో విచారణ కీలక దశకు చేరింది. ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించింది తానేనని ప్రధాన నిందితుడు సాధిక్‌ఖాన్‌ పోలీసుల విచారణలో ఎట్టకేలకు అంగీకరించాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సాధిక్‌ను కోర్టు అనుమతితో సర్పవరం పోలీసులు మూడు రోజులుగా కస్టడీకి తీసుకుని విచారించారు. తొలి రెండు రోజులు ఏమీ తెలియనట్లుగా నాటకమాడిన నిందితుడు, పోలీసులు బలమైన సాంకేతిక ఆధారాలు చూపడంతో నోరు విప్పక తప్పలేదు. ముఖ్యంగా సైనైడ్ విక్రయించిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.

పోలీసుల విచారణలో సాధిక్‌ఖాన్‌ నేరాన్ని పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు. జగదీశ్వరరెడ్డిని ఎలాగైనా అంతం చేయాలనుకున్నానని స్పష్టం చేశాడు. మొదటగా విష పదార్థాన్ని కొబ్బరి నీళ్లలో కలిపి అతనికి ఇచ్చినట్లు తెలిపాడు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే మూడు నాలుగు సార్లు ఇలాగే విషం ఇచ్చినట్లు వెల్లడించాడు. ఆ విషం ప్రభావంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అతను చనిపోతాడనుకున్నామని చెప్పాడు. అయితే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొంత కోలుకుని బయటకు వచ్చాక.. తన ప్లాన్‌ మార్చానని వివరించాడు. ఈసారి ఏకంగా ప్రాణాంతకమైన సైనైడ్‌ను పంపించినట్లు సాధిక్‌ అంగీకరించాడు. ఆ సైనైడ్‌ను ఉపయోగించడంతోనే జగదీశ్వరరెడ్డి మరుసటి రోజు మృతి చెందాడని తెలిపాడు.

ఈ హత్య వెనుక ప్రధానంగా ఆస్తుల గొడవలు ఉన్నట్లు నిందితుడు బయటపెట్టాడు. ఏఈ నూకరాజు కూతురు సౌజన్యను తాను వివాహం చేసుకుంటే వారి కుటుంబానికి చెందిన సుమారు రూ. 25 కోట్ల విలువైన ఆస్తి తనకే వస్తుందని ఆశపడ్డానని సాధిక్‌ చెప్పాడు. అయితే ఆమె తండ్రి మాత్రం ఆ పెళ్లికి ఒప్పుకోలేదని, ఆస్తిని తన మనవడితో పాటు కుటుంబంలోని వేరొకరి పేరున రాస్తామని తేల్చిచెప్పారని వాపోయాడు. ఆస్తి కోసం తాను ఇంత చేస్తే మీరు ఇలా చేయడాన్ని అంగీకరించనని వారితో తీవ్రంగా గొడవ పడ్డానని తెలిపాడు. ఆవేశంతో అప్పట్లో వారిని చంపేస్తానని కూడా బెదిరించినట్లు అంగీకరించాడు. అయితే తాను కేవలం ఆస్తి కోసమే గొడవపడ్డానని, అంతమాత్రాన వారు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తారని తాను ఊహించలేదని సాధిక్‌ పోలీసుల ఎదుట వెల్లడించినట్లు సమాచారం.

ఈ విచారణలో నిందితుడు సాధిక్‌ఖాన్‌ ఉపయోగించిన విష పదార్థానికి సంబంధించిన నమూనాలను పోలీసులు విజయవంతంగా సేకరించి సీజ్ చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. నిందితుడి వాంగ్మూలంతో ఈ సంచలన హత్య కేసుకు సంబంధించి అన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -