మోడీ పిలుపుకు మద్దతుగా నిలిచిన ముస్లిం పార్టీ నేత!

మోడీ అంటే ఎమ్ ఐఎమ్ వాళ్లకు మంట. భారతీయ జనతా పార్టీ అంటే ఏ మాత్రం సానుకూల ధోరణిని కనబరచని ఎమ్ ఐఎమ్ వాలాలు మోడీ అంటే మరింతగా మండి పడతారు.

ఆయనపై తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. గుజరాత్ లో అల్లర్ల దగ్గర నుంచే మోడీ అంటే ఎమ్ ఐఎమ్ కు వ్యతిరేకత మరింత పెరిగింది. ఇక మోడీ ప్రధానమంత్రి అయ్యాక ముస్లింలపై ప్రత్యేకమైన దాడుదలేవీ జరగకపోయినా… ఎమ్ ఐఎమ్ అయితే శాంతించలేదు. మోడీ అంటే అదే ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది ఈ పార్టీ.

మరి ఇలాంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుకు ఎమ్ ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించాడు! మోడీ తన ఐడియాతో అమల్లో పెట్టిన గివ్ ఇట్ అప్ కు ఒవైసీ మద్దతు పలికాడు. తాజాగా ఆయన తన ఇంటి గ్యాస్ సబ్సిడీని వదులుకొన్నాడు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ఈ బాటన నడవగా. .వారికితోడయ్యాడు ఒవైసీ.

మరి విధానాల విషయంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఒవైసీల పార్టీ… మోడీ అంటే పడని ఆ పార్టీ… మోడీ సొంత ఐడియాకు మాత్రం మద్దతు పలకడం విశేషమే. మోడీ పిలుపుకు స్పందనగా ఒవైసీ గ్యాస్ సబ్సిడీని వదులుకోవడం ఆసక్తికరమే!