‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగా, దీని స్క్రిప్ట్ వెనుక ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉందంటూ వస్తున్న విమర్శలను సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ఖండించారు. దిల్లీలో జరిగిన ‘అమృత్ రత్న 2026’ సదస్సులో ఆయన ఈ ఆరోపణలపై స్పందించారు.
సినిమా హిట్ అయిన తర్వాత కొందరు కావాలనే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని రాకేశ్ బేడీ కొట్టిపారేశారు. “పీఎంవోలో కూర్చునే వారు నేను సినిమాలో చెప్పిన కామెడీ డైలాగులు రాయగలరా? అసలు అలాంటి హాస్యం గురించి వారు ఆలోచించగలరా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ స్పై థ్రిల్లర్‌లో కామెడీ డైలాగులు తాను పండించిన తీరుపై ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, మొదట ఆయన కామెడీ సీన్స్ విషయంలో కొంత సంశయించారని రాకేశ్ బేడీ వెల్లడించారు. కథ చాలా సీరియస్‌గా సాగుతుండటంతో, ప్రేక్షకులు కాస్త రిలాక్స్ అయ్యేందుకు కామెడీ జోడించడం మంచిదని తాను దర్శకుడికి సూచించానని చెప్పారు. స్క్రిప్ట్‌ను రెండు, మూడుసార్లు చదివిన తర్వాత తన సలహాను పరిగణనలోకి తీసుకున్న ఆదిత్య, సన్నివేశాలు బాగా వస్తుండటంతో చివరకు వాటిని బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.
ఈ చిత్రంలో రాకేశ్ బేడీ పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ‘జమీల్ జమాలీ’ పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా సినిమాలో ఆయన పలికిన ‘బచ్చా హై తు మేరా’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి భాగం, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో వచ్చిన రెండో భాగం కూడా ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
