ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ సర్కార్… రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు మార్క్ రెండేళ్ల పాలన కేవలం హామీల ఉల్లంఘనగానే మిగిలిపోయిందని విమర్శిస్తున్నారు.
ఈ రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం ఏకంగా రూ.3.40 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు చేసిందని విపక్షాలు గణాంకాలను విడుదల చేశాయి. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చినప్పటికీ, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేశారని ఆరోపించారు. ఈ అప్పుల భారం భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నివేదిక పేర్కొంది.
తల్లికి వందనం…పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఇస్తామన్న హామీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. పొరుగు రాష్ట్రాల తరహాలో ఏపీలోనూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామన్న వాగ్దానం కాగితాలకే పరిమితమైంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని చెప్పి, రెండేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అన్నదాత సుఖీభవ..రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20,000 అందిస్తామన్న హామీపై స్పష్టత కరువైంది.అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్‌గా మార్చారంటూ సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
