మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారత వైమానిక దళ (IAF) అధికారి భార్యపై జరిగిన అఘాయిత్యం కలకలం రేపింది. పాత క్లాస్‌మేట్ అయిన యువకుడు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ బలవంతంగా మతమార్పిడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె పాత క్లాస్‌మేట్ అయాజ్ తాజ్ మదారే (26), ఆస్తి కొనుగోలు నెపంతో నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న ఒక హోటల్‌కు ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను రికార్డు చేశాడు. అప్పటి నుండి ఆ వీడియోలను చూపిస్తూ ఆమెను నిరంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికంగా వేధించాడు. బాధితురాలి నుండి ఇప్పటివరకు రూ. 3.09 లక్షలు వసూలు చేశాడు.
అంతేకాకుండా, నిందితుడు ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. మే నెలలో ఆమెను బలవంతంగా ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అమీన్ షేక్ మరియు ఒక మత గురువు (మౌలానా) సహాయంతో మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ సమయంలో బాధితురాలు ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా, బలవంతంగా ఆచారాలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత, తమకు వివాహం జరిగిందని అబద్ధం చెప్పి, మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణం 2025 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ, నిందితుడి బెదిరింపుల వల్ల బాధిత మహిళ భయంతో మౌనంగా ఉండిపోయింది. ఇటీవల ధైర్యం తెచ్చుకుని తన భర్తకు విషయం చెప్పడంతో, జూన్ 13న సోనేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అయాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్లను అరెస్ట్ చేసి, 5 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. మతమార్పిడిలో పాల్గొన్న మత గురువు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
