కుటుంబంలో జరుగుతున్న చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు చివరకు ఒక పచ్చని సంసారంలో ఊహించని ఘోర విషాదాన్ని నింపాయి. నిత్యం జరిగే గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక కన్నతల్లి.. విచక్షణ కోల్పోయి కసాయిగా మారింది. ఏ పాపం తెలియని తన ఇద్దరు కన్నబిడ్డలను దారుణంగా ఉరివేసి చంపేసి.. ఆ తర్వాత తాను కూడా అదే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భయంకరమైన సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరు పసిపిల్లలతో పాటు తల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన జంబుల మల్లేష్ (32) అనే వ్యక్తికి, జంబుల నవనీత అలియాస్ సునీత (27) తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు విగ్నేష్ (7) అనే కుమారుడు, మధుప్రియ (5) అనే కుమార్తె ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మల్లేష్, నవనీతల మధ్య కుటుంబ విషయాలపై నిత్యం తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భార్యాభర్తల మధ్య మరోసారి పెద్ద వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ గొడవలతో తీవ్ర ఆవేశం, మానసిక క్షోభకు గురైన నవనీత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన అక్కున చేర్చుకోవాల్సిన ఏడేళ్ల కొడుకు విగ్నేష్, ఐదేళ్ల కూతురు మధుప్రియలను ఒకే గదిలో దారుణంగా ఉరివేసి కడతేర్చింది. పసిప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత.. నవనీత కూడా అదే గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న కుల్కచర్ల, చౌడాపూర్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో సాక్ష్యాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నతల్లి చేతిలోనే ఆ పసిప్రాణాలు బలికావడం చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.
