యువ నటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ లో దొంగతనం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సామ్రాట్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు ఆదేశించింది. సామ్రాట్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ట్రెస్ పాస్, చోరీ ఐపీసీ సెక్షన్ 380, 427 ఆర్/డబ్ల్యు, 201 కింద కేసులు నమోదు చేశారు.
తన భర్త సామ్రాట్‌కు ఇతర అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, మాదకద్రవ్యాలు కూడా వాడుతున్నారని భార్య హర్షిత ఆరోపించారు. వివాహం అయినప్పటి నుంచి కట్నం కోసం తనను తీవ్రంగా వేధించడమే కాకుండా చిత్రహింసలు పెట్టే వాడని ఆమె కంటతడి పెట్టారు. సినిమాల్లో నటించనని చెప్పిన తర్వాతనే తన కూతురిని సామ్రాట్‌కిచ్చి వివాహం చేశానని హర్షితా తండ్రి కృష్ణారెడ్డి తెలిపారు.
మరో వైపు సామ్రాట్‌రెడ్డి తల్లి జయా రెడ్డి కూడా హర్షితపై ఆరోపనలు చేసింది. హర్షిత కుటుంబ సభ్యులతో రాజీకి తాము సిద్ధమని చెప్పారు. పెళ్లయినప్పటి నుంచి తన కొడుకు నరకం అనుభవిస్తున్నాడని వాపోయారు. తన కొడుకు సామ్రాట్ రెడ్డి సినిమాల్లో నటించడం హర్షితకు ఇష్టం లేదని చెప్పారు. మానసికంగా హింసించారన్నారు. తన కొడుకు ఎవరితో మాట్లాడినా హర్షిత అనుమానించేదని ఆరోపించారు.
మరోవైపు, సామ్రాట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు బుధవారానికి వాయిదా పడింది. రేపటి తీర్పు కోసం ఆసక్తి నెలకొంది.
