ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై సంచలన ఆరోపనలు చేశారు కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి . చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడుల హత్య కేసులోని నిందితుడు శ్యాంబాబు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
2017 మే 21న నారాయణరెడ్డి, సాంబశివుడులను అత్యంత కిరాతకంగా హత్య చేశారని శ్రీదేవి చెప్పారు. ఈ కేసులో కేఈ శ్యాంబాబు, జెడ్పీటీసీ బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్ లతో సహా 15 మందిని నిందితులుగా చేర్చారని… అయితే డిప్యూటీ సీఎం తన పలుకుబడిని ఉపయోగించి శ్యాంబాబు, బొజ్జమ్మ, తులసీ ప్రసాద్ లపై కేసును తొలగించారని తెలిపారు.
ఈ వ్యవహారంపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా… కేసులో వీరందరినీ ముద్దుయిలుగా చేర్చి, అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే, శ్యాంబాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్టు ఓ పత్రికలో ప్రచురించారని… అది వాస్తవం కాదని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో స్టే వచ్చినా, తాము సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని… నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.
