అత్యధిక పాటలు పాడిన గాయనిగా గానకోకిల పి.సుశీల గిన్నిస్ రికార్డులకెక్కారు. 1960 నుండి సేకరించి, నిర్ధారించినమేరకుసోలో, డ్యూయట్, కోరస్ ఆధారిత పాటల విభాగంలో 6 భాషల్లో 17,695 పాటలు పాడినందుకు ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సోమవారం ధృవీకరణ పత్రాన్ని అందజేసింది.
గానకోకిల బిరుదును సార్ధకం చేసుకుని యావత్ భారతీయ సినీ సంగీత ప్రియులను తన స్వరమాధుర్యంతో ఓలలాడించిన పి.సుశీల కీర్తిసిగలో ఈ అరుదైన మైలురాయి చేరడం పట్ల సినీ సంగీత కళాకారులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అభిమానులైతే ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నిజానికి సుశీల కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయనిగా 1968లోనే రికార్డు సాధించిన సుశీల ఇప్పటి వరకు ఐదు జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సుశీల 1,336 డ్యూయెట్లను పాడారు. అత్యధిక డ్యూయెట్లు పాడిన గాయనీగాయకులుగా కూడా బాలు, సుశీల రికార్డులకెక్కారు. 1960లో ఆలిండియా రేడియోలో గాయనిగా కెరీర్ ప్రారంభించిన సుశీల ‘పెట్రతాయ్’ అనే తమిళ చిత్రంతో సినీ నేపథ్య గాయనిగా మారారు.
ఆరు దశాబ్దాల ఆమె సినీ సంగీత ప్రస్థానంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగా భాషల్లో రికార్డు సంఖ్యలో పాటలు పాడారు. 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. సుశీల అభిమాని, ప్రైవేటు సంగీత సంస్థ నిర్వాహకుడు అయిన శ్రీరామ్ తన అభిమాన గాయని పాటలను సేకరించి, గిన్నిస్ రికార్డు సాధనకు తోడ్పడ్డారు
నా జీవితం సంగీతమయం
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధనపై పి.సుశీల స్పందిస్తూ… ‘గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. గిన్నిస్ నిర్వాహకులకు, పాటలను సేకరించిన శ్రీరామ్‌కి, కెరీర్ ప్రారంభంలో అవకాశాలిచ్చిన ఏవీఎం మెయ్యప్పన చెట్టియార్‌కి, ముఖ్యంగా నా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితం సంగీతానికి, నా పాటలను ఆరాధించే అభిమానులకే అంకితం’ అన్నారు. మీ పాటల్లో మీకు నచ్చే పాటలు ఏమిటని ప్రశ్నిస్తే… అభిమానులకి నచ్చే పాటలన్నీ తనకూ నచ్చుతాయన్నారు. లతా మంగేష్కర్ స్వరంలా ఉంటుందని తన భర్త తనను వివాహం చేసుకున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా సరదాగా చెప్పారు. వారసుల గురించి అడుగగా, తన కోడలు మంచి గాయకురాలని, ఏఆర్ రెహ్మాన చిత్రాల్లో రెండు పాటలు పాడిందని, అవకాశాలొస్తే ఆమె గాయనిగా రాణిస్తుందన్నారు.
