హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కళాశాల హాస్టల్లో ఉంటున్న ఇంటర్ విద్యార్థిని ప్రసవించగా, పుట్టిన శిశువు భవనంపై నుంచి పడి మృతి చెందింది.
గోల్కొండ ప్రాంతంలోని ఓ జూనియర్ కళాశాల హాస్టల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఉంటోంది. సోమవారం ఆమె హాస్టల్ బాత్రూమ్లోనే ప్రసవించింది. అనంతరం నవజాత శిశువును భవనం పై అంతస్తు నుంచి కిందకు పడేయడంతో ఆ శిశువు అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలియగానే హాస్టల్ సిబ్బంది విద్యార్థినిని వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమెకు చికిత్స అందుతోంది. మృతి చెందిన శిశువు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
విద్యార్థిని గర్భవతి అన్న విషయం కళాశాల యాజమాన్యానికి, హాస్టల్ సిబ్బందికి అసలు తెలియకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. నిర్వహణలో వైఫల్యం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా, కుటుంబ సభ్యులు యువతి తన బావ వల్లే గర్భం దాల్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
