Sunday, May 19, 2024
- Advertisement -

‘సాక్ష్యం’ రివ్యూ

- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘జయ జానకి నాయక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస్ ఈ ఏడాది ‘సాక్ష్యం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ట్రైలర్, టీజర్ కొత్తగా ఉండడంతో సినిమాపై ఆసక్తి కలిగింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తీసుకుందాం!

కథ: మునుస్వామి(జగపతిబాబు) అతి క్రూరమైన వ్యక్తి. తన సంపాదన కోసం ముగ్గురు తమ్ముళ్లతో కలిసి చిన్న, పెద్ద అని తేడా లేకుండా విచక్షణారహితంగా తనకు అడ్డు వచ్చే వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో ఊరికి పెద్దయిన రాజా(శరత్ కుమార్) కుటుంబాన్ని తనకు అడ్డుగా ఉన్నారని పిల్లలతో సహా మొత్తం అందరినీ చంపేస్తాడు. ఆ కుటుంబానికి చెందిన వారసుడ్ని మాత్రం ఆవుదూడ సహాయంతో మునుస్వామి నుండి తప్పిస్తారు. అలా బయటపడ్డ నెలల పిల్లాడ్ని కాశీలో శివప్రకాష్(జయప్రకాష్) దంపతులు శివప్రసాదంగా దత్తత తీసుకుంటారు. అతడికి విశ్వాజ్ఞ(బెల్లంకొండ శ్రీనివాస్) అని నామకరణం చేసి తమతో పాటు అమెరికా తీసుకొని వెళ్లిపోతారు. పెద్దయిన తరువాత విశ్వ వీడియో గేమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

ఈ క్రమంలో అతడికి సౌందర్య లహరి(పూజా హెగ్డే) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమెను మొదటిచూపులోనే ఇష్టపడతాడు. కొన్ని కారణాల వలన వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అదే సమయంలో సౌందర్య లహరి ఇండియాకు వెళ్లిపోతుంది. ఆమె ప్రేమను వెతుక్కుంటూ ఇండియాకు బయలుదేరతాడు విశ్వ. అలా ఇండియాకు వచ్చిన అతడు ఓ గొడవలో మునుస్వామి తమ్ముడిని చంపేస్తాడు. అసలు విశ్వ అతడిని చంపడానికి గల కారణాలు ఏంటి..? తన గతం గురించి ఏ మాత్రం అవగాహన లేని విశ్వ.. మునుస్వామి కుటుంబంతో ఎందుకు గొడవ పెట్టుకుంటాడు..? ఇండియాలో విశ్వకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:పశ్చాత్తాపం కూడా చేసుకోలేనన్ని పాపాలు చేసే వారిని పంచభూతాలు ఒక్కటై ఎలా నాశనం చేస్తాయనేదే ఈ సినిమా కాన్సెప్ట్. చిన్నప్పుడే శత్రువుల పోరులో కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్న రాజా వారసుడు మరొకరి దగ్గర పెరుగుతుంటాడు. తన గతంలో ఏం జరిగిందనే విషయం అతడికి తెలియదు. అలానే శత్రువు కొడుకు ప్రాణాలతో ఉన్నాడనే విషయం వాళ్లకి తెలియదు. కానీ ఆ వారసుడి కారణంగానే ప్రతినాయకుడి ఇంట్లో ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఎవరు చంపుతున్నారనే విషయం విలన్లకు అర్ధం కాదు.. ఎందుకు చంపుతున్నాననే విషయం హీరోకి తెలియదు. కానీ ఒకరిని గాలిలో, మరొకరిని నిప్పులో, ఇంకొకరిని మట్టిలో చివరగా మిగిలిన మరొకరిని నీటిలో ఇలా పంచభూతాల సాక్షిగా నలుగురు పాపాత్ములను ఎలా అంతం చేశాడనే విషయాలతో సినిమా మొత్తం నడిపించాడు.

సినిమా ఆరంభ సన్నివేశాల్లో అహింస ఎక్కువగా చూపించినప్పటికీ అవి సినిమాకు ప్లస్సే అయ్యాయి. ఇక హీరో ఫారెన్ లో పెరగడం, అతడి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయి ఇలా సాధారణ సన్నివేశాలతో సాగిపోతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కు సినిమా టర్నింగ్ తీసుకుంటుంది. ఒక్కొక్కరిగా మునుస్వామి తమ్ముళ్లు హీరో చేతిలో మరణించడం సినిమాపై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. అయితే పంటికింద రాయిలా తగిలే పాటలు మాత్రం చాలా విసిగిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హీరో విలన్లను ఎలా మట్టికరిపించాడనేదే చూపించారు. పంచభూతాలు, పవర్ ఫుల్ విలన్ ఇలా దర్శకుడు అనుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ దాన్ని తెరకెక్కించిన విధానంలో కొన్ని తప్పులు దొర్లాయి. 

హీరో ఇండియా వచ్చిన దగ్గర నుండి వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఏవరేజ్ అనే చెప్పాలి.  క్లైమాక్స్ లో హీరో ఎద్దు ఎక్కి విలన్లను వెంబడించడం ట్రైలర్ లో వెటకారంగా కనిపించినా.. సినిమాలో మాత్రం కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో దేవుడు, సృష్టి వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో అన్ని వర్గాల ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. తెరపై ‘శివం శివం హరం హరం’ అనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిఎంమా స్థాయిని పెంచింది. ఈ మధ్యకాలంలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లతో పోల్చి చూస్తే ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు. ‘వాయుపుత్రం’ అంటూ సాగే చిన్న బిట్ సైతం మెప్పిస్తుంది. దేవుడ్ని, విధిని నమ్మేవారు.. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాను చూడొచ్చు. కానీ అన్ని రకాల ఎమోషన్స్ మాత్రం ఈ సినిమాలో దొరకవు.

హీరోగా సాయి శ్రీనివాస్ హావభావాల విషయంలో ఇంకా పరిణితి చెందాల్సివుంది. యాక్షన్, డాన్స్ లలో అతడికి వంక పెట్టలేం. కానీ మరీ బరువైన భారీ కథలను ఎన్నుకోకుండా సింపుల్ గా అతడికి సూట్ అయ్యే కథలతో సినిమాలు చేస్తే కెరీర్ పరంగా మంచి బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉంది. పూజా హెగ్డే తెరపై అందంగా కనిపిస్తున్నా… ఆమె కాస్ట్యూమ్స్ కారణంగా ఆమెను చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. నటన పరంగా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ జగపతిబాబు పాత్ర. మునుస్వామిగా అతడి నటన సినిమా స్థాయిని పెంచింది. జగపతిబాబు తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో.. ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రల్లో మునుస్వామి ఒకటి. రావు రమేష్, జయప్రకాశ్ వంటి సీనియర్ నటుల గురించి చెప్పనక్కర్లేదు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్విస్తాడు.

సాంకేతిక వ‌ర్గం :టెక్నికల్ గా సినిమాను హై క్వాలిటీతో రూపొందించారు. కెమెరా వర్క్ సినిమాకు ప్లస్. పాటల కంటే నేపధ్య సంగీతం అలరిస్తుంది. నిశితార్థం సమయంలో వచ్చే పాటకు తప్ప అన్ని పాటలకు కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడిగా ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలే చేసిన దర్శకుడు శ్రీవాస్ ఈసారి కూడా అలాంటి కథనే ఎన్నుకున్నాడు. కానీ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మాత్రం సినిమా చేయలేకపోయాడు.సెకండ్ హాఫ్ కోసం ఒకసారి ఈ సినిమాను చూసే ప్రయత్నం చేయొచ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -