కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు మరణానంతర గౌరవ డాక్టరేట్ ను మైసూరు యూనివర్సిటీ ప్రకటించింది. సినీ రంగానికి అందించిన సేవలతో పాటు ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు మైసూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ హేమంత్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్కుమార్కు కూడా మైసూర్ యూనివర్శిటీ గతంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. పునీత్ తరుపున డాక్టరేట్ ను ఆయన భార్య అశ్విని అందుకోనున్నారు. ఇందుకు ఆమె అంగీకరించినట్లు మైసూర్ యూనివర్శిటీ వర్గాలు ప్రకటించాయి. మార్చి 22న జరగబోయే 102వ కాన్వకేషన్ కార్యక్రమంలో పునీత్ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 29న పునీత్ గుండె పోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రికి తరలించే లోపు తుదిశ్వాస విడిచారు. పునీత్ హఠాన్మరణం కర్ణాటకనే కాకుండా యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన్ను కడసారి చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు. అశ్రు నయనాల మధ్య ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికారు. పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మైసూర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తుండటం ఆయన అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. పునీత్ చివరి సారిగా నటించిన జేమ్స్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీతో లవ్‌లో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?