టాలీవుడ్‌లో రొమాంటిక్ లవ్‌స్టోరీలకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదని, కొవిడ్ తర్వాత మళ్లీ అలాంటి సినిమాల ట్రెండ్ పుంజుకోవడం ఎంతో సంతోషకరమని యువ నటుడు నాగచైతన్య అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగచైతన్య సినిమా విజయంపై తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ మహమ్మారి తర్వాత టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలు రావడం తగ్గిపోయాయని, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి లవ్‌స్టోరీలను ఆదరిస్తారా లేదా అని మొదట్లో నేను చాలా భయపడ్డాను. కానీ, ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంతో మేకర్స్ ఒక అద్భుతమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించారు. ఇప్పటివరకు మనం కేవలం ఇద్దరు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటి సాధారణ కథలనే చూశాం. కానీ, ఒక బ్రేకప్ తర్వాత ప్రేమకథ ఎలా ఉంటుందనే సరికొత్త కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నేటి తరానికి ఇది కచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి విభిన్నమైన లవ్‌స్టోరీలు రావాలని నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు. ఈ కథను అత్యద్భుతంగా రాసిన దర్శకుడు సాయి రాజేశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఇదే వేదికపై హీరో కిరణ్ అబ్బవరం పడ్డ కష్టాన్ని నాగచైతన్య కొనియాడారు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని కిరణ్ ఈ స్థాయికి చేరుకున్నాడని, గతంలో ‘క’ సినిమా ఈవెంట్‌లో అతడు మాట్లాడిన మాటలు విని తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. సినిమా కోసం కిరణ్ పెట్టే ఎఫర్ట్స్ నిజంగా అభినందనీయమన్నారు. ఇక ఈ చిత్రంలో నటించిన శ్రీ గౌరీ ప్రియ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించడంలో నిర్మాత ఎస్‌కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. కేవలం పోస్టర్లపై కలెక్షన్ల నంబర్లు వేయడం ముఖ్యం కాదని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని వారి ఆదరణ పొందడమే అసలైన నిజమైన విజయం అని నాగచైతన్య స్పష్టం చేశారు.
