Monday, May 13, 2024
- Advertisement -

రివ్యూ: హిట్టు కొట్టిన రాక్షసుడు

- Advertisement -

బెల్లకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటీ నటులుగా రాక్షసుడు అనే సినిమా తెలుగు విడుదల అయింది. తమిళం లో ఇప్పటికే విజయం సాధించిన రట్సాసన్ అనే సినిమా రీమేక్ గా ఈ సినిమా చేయబడింది. ఈ సినిమా సమీక్ష ఈ కింద చదవండి.

కథ:
అరున్ కుమార్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఒక దర్శకుడు అవుదామని కలలు కంటూ ఉంటాడు. చేతిలో సైకో కిల్లర్ గురించి తను రాసుకున్న ఒక స్క్రిప్ట్ ని పట్టుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ పరిస్థితుల వల్ల అతను సినిమాలు మానేసి పోలీస్ ఆఫీసర్ గా మారాల్సి వస్తుంది. ఒకరోజు అరున్ కుమార్ కి ఒక టీనేజ్ అమ్మాయి హత్యకేసు వస్తుంది. అది సైకో కిల్లర్ చేసిన పని అని అరున్ కుమార్ కి అర్ధమవుతుంది. కేసు విషయమై స్కూల్ టీచర్ కృష్ణవేణి (అనుపమ పరమేశ్వరన్) కలిసిన అరున్ కుమార్ వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ సైకో కిల్లర్ గురించి ఒక్క క్లూ కూడా లేని అరున్ కుమార్ కి వ్యక్తిగత నష్టం వల్ల కొన్ని ఆధారాలు లభిస్తాయి. అరున్ కుమార్ కి జరిగిన నష్టం ఏంటి? అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అరున్ కుమార్ సైకో కిల్లర్ ని పట్టుకోగలిగాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
ప్రతి సినిమాతోనూ ఇంప్రూవ్ అవుతూ వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా చక్కగా ఒదిగిపోయి బాగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో చాలా అందంగా ఉంది. నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకుంటుంది అనుపమ. చైల్డ్ ఆర్టిస్ట్ దువా కౌశిక్ క్యూట్ గా బాగా నటించింది. శరవణన్ తప్ప ఆ పాత్రని ఇంకెవరు అంత బాగా పండించాలేరేమో అన్నంత బాగా నటించాడు. వినోద్ సాగర్ నటన బాగుంది. రాజీవ్ కనకాల నటన వల్ల సినిమాకి మరింత బలం చేకూరింది. వినోదిని వైద్యనాథన్ మరియు అమ్ము అభిరామి సినిమాలో చాలా బాగా నటించారు. కేశవ్ దీపక్ మరియు సుజానే జార్జ్ కూడా చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు రమేష్ వర్మ సినిమా కథ లో ఎటువంటి మార్పులు చేయలేదు. నిజానికి చాలావరకు సన్నివేశాలు మక్కీకి మక్కీ దింపినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టించకుండా కథను రమేష్ వర్మ బాగా ప్రెజెంట్ చేశాడని చెప్పవచ్చు. ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బెల్లంకొండ మార్కెట్ ఎలా ఉన్నా నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. గిబ్రాన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. అమర్ రెడ్డి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
మిగతా థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బలమైన కథ కచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా లోని మొదటి హాఫ్ మొత్తం చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఇంటర్వల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక మొదటి హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మరింత ఫాస్ట్ గా నడుస్తుంది. ఊహించని ట్విస్ట్ లతో సినిమా రసవత్తరంగా సాగుతుంది. బలమైన కథ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, నటీనటులు మరియు బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అయితే తమిళంలో వర్కవుట్ అయిన సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవచ్చు. అక్కడక్కడా కనిపించే తమిళ్ నేటివిటి కూడా తెలుగు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. చివరిగా ‘రాక్షసుడు’ సినిమా ప్రేక్షకులకు ఒక త్రిల్లింగ్ రైడ్ ఇస్తుందని చెప్పచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -