తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భూమన అభినయ్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన APSRTC ఉద్యోగుల సంఘీభావ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు తెలుపుతూనే వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని…APSRTC ద్వారానే నిర్వహించాలని, ప్రస్తుతం సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో RTC ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.
దశాబ్దాలుగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన APSRTCని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు సహించరని నేడు తిరుపతిలో జరిగిన ర్యాలీ ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇది ముగింపు కాదు, ప్రజా రవాణా పరిరక్షణ కోసం ప్రారంభమైన ఉద్యమం. ఇక రాష్ట్రం మొత్తం వినిపించే వరకు ఈ ఉద్యమం ఆగదు అని వైసీపీ నేతలు తేల్చిచెప్పారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికులు, పార్టీ శ్రేణులు మరియు సామాన్య ప్రజలతో తిరుపతి వీధులు ఎరుపు రంగు నిరసన జెండాలతో నిండిపోయాయి. ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ప్రభుత్వ రవాణా రంగాన్ని బలిపెట్టవద్దని నిరసనకారులు డిమాండ్ చేశారు.
తిరుపతిలో ప్రారంభమైన ఈ సంఘీభావ ర్యాలీ కేవలం ఒక ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజా రవాణాను కాపాడుకునేందుకు, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం ఈ ఉద్యమ నినాదం రాష్ట్రంలోని ప్రతి డిపోకు, ప్రతి మూలకు వినిపించేలా రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
