- Advertisement -

పవన్‌కు కొత్త టెన్షన్‌..పోలవరంలో సెగ!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విబేధాలు, గ్రూపు రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా ఉన్న చిర్రి బాలరాజుకు, సొంత పార్టీలోని కొందరు స్థానిక నేతలకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ వర్గపోరు పతాక స్థాయికి చేరింది.

ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇటీవల తన అనుచరులతో కలిసి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. నియోజకవర్గంలో కొందరు కుల పెద్దలుగా చలామణీ అవుతూ, సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చీటికి మాటికి తన ఆధిపత్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని నడిరోడ్డుపై గుడ్డలూడదీసి కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకోకుంటే తన పేరు బాలరాజు కాదంటూ సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే ఇంతలా చిర్రెత్తిపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, కొందరు స్థానిక నేతలు “పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ జనసేన పరిశీలకుడు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకువచ్చారు. ప్రోగ్రామ్ జరుగుతున్న విషయం కూడా తనకు తెలియకపోవడంతో, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనను కొందరు కావాలనే తొక్కేయాలని చూస్తున్నారని బాలరాజు భావించారు. గతంలో తనపై అవినీతి ఆరోపణలు చేసిన నాయకులే ఈ కార్యక్రమం వెనుక ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో, అదీ పోలవరం లాంటి నియోజకవర్గంలో ఇలాంటి తీవ్ర వర్గపోరు నడవడం కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఈ విషయంలో హెచ్చరించినప్పటికీ, స్థానికంగా పరిస్థితి ఏమాత్రం సద్దుమణగలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -