తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) లేఖ ద్వారా తెలియజేసింది.
ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 20 నుంచి 23 వరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 24న పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శకాలు ఇచ్చారు. అదే విధంగా, ఈ నెల 19 నుంచి దశలవారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ రాణి కుముదిని శుక్రవారం అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2,630 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎస్ఈసీ విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో పురుషులు 25,62,369 మంది, మహిళలు 26,80,014 మంది, థర్డ్జెండర్లు 640 మంది ఉన్నట్లు వెల్లడించింది.
ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
30న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
31న నామినేషన్ల పరిశీలన
వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణ
11న పోలింగ్
12న రిపోలింగ్
13న కౌంటింగ్ పలితాలు
