భారత మహిళా క్రికెట్ స్టార్, టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘టైమ్ మేగజైన్’ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది.
ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించారు. క్రీడా ప్రపంచాన్ని శాసిస్తున్న అథ్లెట్లు, కోచ్‌లు, ఇన్వెస్టర్లతో కూడిన ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో భారతదేశం తరపున ఆమె ఒక్కరే నిలవడం దేశానికే గర్వకారణం.
బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ , ఫుట్‌బాల్ ప్రపంచ విజేత లియోనల్ మెస్సి , క్రిస్టియానో రొనాల్డో, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ వంటి అంతర్జాతీయ క్రీడా దిగ్గజాలతో కూడిన ఎలైట్ క్లబ్లో 29 ఏళ్ల స్మృతి మంధాన స్థానం సంపాదించుకోవడం ఆమె క్రేజ్‌కు అద్దం పడుతోంది.
టైమ్ మేగజైన్ తన ప్రొఫైల్‌లో స్మృతి మంధాన సాధించిన అద్భుతమైన రికార్డులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీ చేసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఒకే క్యాలెండర్ ఇయర్లో 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు చేసిన మొదటి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం 17 అంతర్జాతీయ సెంచరీలతో మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ టైటిల్స్ సాధించి పెట్టారు. స్మృతి మందన్న కెరీర్లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. ఆమె కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాకుండా, జట్టును విజయపథంలో నడిపించే అద్భుతమైన నాయకురాలిగా ఎదిగారు అని టైమ్ మేగజైన్ కొనియాడింది.
