కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయికగా నటించింది. నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో యశ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘కేజీఎఫ్’ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని పేర్కొన్నారు. నిజాయతీగా, ప్యాషన్‌తో పనిచేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలుస్తారని తెలిపారు. నాలాంటి సామాన్య వ్యక్తి కూడా కలలు కనొచ్చని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇక్కడ ఎలాంటి సరిహద్దులు, భాషా భేదాలు లేవని, మానవత్వం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.
యువతను ఉద్దేశించి యశ్ మాట్లాడుతూ.. సినిమాను ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికోసం నిజాయతీగా కష్టపడితే ఏ రంగంలోనైనా గౌరవం, విజయం దొరుకుతాయని చెప్పారు. మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయని, అందరూ తమ భాషను ప్రేమించాలని కోరారు. అయితే నార్త్, సౌత్ అనే భేదాలు లేకుండా మనమంతా ఒక్కటే ఇండియన్ సినిమాగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో భారతీయ సినిమాను ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత వెంకట్ కె. నారాయణ మాట్లాడుతూ.. ఇదొక జెన్‌జీ లాంగ్వేజ్ సినిమా అని తెలిపారు. చాలా పెద్ద విజన్‌తో, బోల్డ్ డ్రీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, నటీనటులు రుక్మిణి, కియారా, హ్యూమా ఖురేషి, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.
