Saturday, May 18, 2024
- Advertisement -

దొంగ అని పొర‌బ‌డ్డారు: ర‌ష్య‌న్ యాత్రికుడిపై రైతుల దాడి

- Advertisement -

భాష ఎంత ముఖ్య‌మో ఈ ఘ‌ట‌న తెలుసుకుంటే అర్థమ‌వుతోంది. మ‌న‌కు భాష రాని రాష్ట్రంలో తిరిగితే అక్క‌డ ఎలా జాగ్ర‌త్త‌గా ఉండాలో చెప్పే సంఘ‌ట‌న ఇది. రష్యాకు చెందిన వీ వోలెజ్‌ (44) సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. యాత్ర‌లో భాగంగా నిజామాబాద్‌ నుంచి షిర్డీకి వెళ్తున్నాడు. అయితే కామారెడ్డి జిల్లా బికనూర్‌కు చేరుకోగానే గాలివాన మొదలైంది. వోలెజ్‌ తన ప్రయాణానికి విరామం ఇచ్చి సమీపంలోని పొలాల్లో త‌న వెంట తెచ్చుకున్న సామ‌గ్రితో గుడారం ఏర్పాటుచేసుకుని కూర్చున్నాడు.

ఈ స‌మ‌యంలో పొలం యాజమాని మహేందర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని పొలంలో టెంట్‌ వేసుకుని సేద తీరుతున్న వోలెజ్‌ని ప్రశ్నించాడు. అతడు ర‌ష్య‌న్ భాషలో సమాధానం ఇచ్చాడు. అయితే ఆ రైతుకు విదేశీయుడి మాటలు అర్థం కాకపోవడంతో వాగ్వాదం ఏర్ప‌డింది. చివరకు భాష అర్థం కాని మహేందర్‌రెడ్డి వోలెజ్‌ని దొంగ అనుకొని దాడి చేశాడు.

అత‌డికి తోడు మరికొందరు రైతులు చేరి వోలెజ్‌పై తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వోలెజ్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మహేందర్‌రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వోలెజ్‌ గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ సాయం తీసుకుందామని ప్రయత్నించాడనీ.. కానీ, అంతలోనే మహేందర్‌ రెడ్డి అతడిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల, దవడ, కుడి చేతికి గాయాల‌వ‌డంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -