Sunday, May 19, 2024
- Advertisement -

దెబ్బ‌కు దెబ్బ‌…ఎల్‌ఓసీని దాటి పాక్ సైనికులను హతమార్చిన ఆర్మీ..

- Advertisement -

భారత్‌ – పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద హైటెన్షన్‌ నెలకొంది. ఎల్‌వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులను హతమార్చింది. మూడు రోజుల కింద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మేజర్, ఇద్దరు సైనికుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత సైన్యం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి మృతికి ఎలాగైన బదులు తీర్చుకోవాలని ఆర్మీ భావించింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యంపై సోమవారం అర్థరాత్రి విరుచుకుపడింది. భారత జవాన్లు కాల్పుల్లో ముగ్గురు పాక్ సైనికులు హతమయ్యారు. అలాగే పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ తీవ్రవాదిని జమ్మూ కశ్మీర్ పోలీసులు హతమార్చారు. గత కొన్నేళ్లతో పోల్చితే ఈ ఏడాది అత్యధికంగా కాల్పుల విరమణను పాక్ సైన్యం ఉల్లంఘించింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 780 సార్లు అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది.

మరోవైపు సోమవారం పుల్వామా జిల్లా సంబూర ప్రాంతంలోని జైషే మహ్మద్ తీవ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న జమ్మూ కశ్మీర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో పోలీసులు కార్డన్ సెర్చ్‌ ప్రారంభించారు. దీంతో తీవ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ తీవ్రవాది నూర్ మహ్మద్ తాంత్రే హతమయ్యాడు.

2015లో పెరోల్‌పై బయటకు వచ్చిన నూర్ అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల శ్రీనగర్ విమానాశ్రమం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారి ఇతడే. దక్షిణ, మధ్య కశ్మీర్‌లోని జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాల్లో నూర్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాంత్రేను పోలీసులు మట్టుబెట్టడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. మ‌రో వైపు భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్‌ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -