Thursday, April 25, 2024
- Advertisement -

“అగ్నిపథ్” పై రచ్చ.. అసలేంటి ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన అగ్నిపథ్ గురించిన చర్చే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ “అగ్నిపథ్ ” పథకంపై ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే విద్యార్థుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతోంది. అదే సమయంలో ఈ పథకంపై ఏర్పడ్డ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి విపక్ష పార్టీలు. మరి ఈ స్థాయిలో అగ్నిపథ్ పథకం పై వ్యతిరేకత ఎందుకు ఏర్పడుతోంది..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి? ఈ పథకం ఏ యే దేశాలలో అమలు చేస్తున్నారు ? వంటి విషయాలను తెలుసుకుందాం ..!

అగ్నిపథ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం :-
గత మూడేళ్ళ కాలంలో కరోనా కరణంగా ఆర్మీ కి సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు. దాంతో దేశంలోని చాలా రాష్ట్రాలలోని విద్యార్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం దర్నాలు రాస్తారోకోలు వంటివి చేశారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే విద్యార్థులు ఎక్కువగా ఉండడం, రిక్రూట్మెంట్ లో పోస్టులు తక్కువగా ఉండడంతో కేంద్రం ” అగ్నిపథ్ ” అనే సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా 17 ఏళ్ల వయసు నుండి 21 ఏళ్ల వయసు మద్య ఉన్నవారిని సైన్యం లోకి తీసుకుంటారు. వీరిని ” అగ్ని వీర్ ” అంటారు. వీరు నాలుగు సంవత్సరాలు సైన్యంతో కలిసి పనిచెయ్యవలసి ఉంటుంది. నాలుగు సంవత్సరాల తరువాత వీరి పనితీరును బట్టి 25 శాతం మందిని రెగ్యులర్ ఆర్మీ కేటగిరీ లో సెలెక్ట్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తారన్నమాట.

జితా బాద్యతలు :-
అగ్నిపథ్‌ కింద సైన్యంలో చేరిన వారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో 21 వేలు మాత్రమే వారికి అందుతుంది. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36500లో 10980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది. ఒకవేళ సైన్యంలో ఉండగా చనిపోయిన వారికి 48 లక్షల జీవిత బీమా వారి యొక్క కుటుంబానికి లబిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

అగ్నిపథ్ ను అమలు చేస్తున్న మరికొన్ని దేశాలు :-
ఇదే విధానాన్ని మరికొన్ని దేశాలు కూడా అమలు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇజ్రాయిల్, బ్రెజిల్, ఇరాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా వంటి దేశాలో కూడా అగ్నిపథ్ విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అగ్నిపథ్ పై వ్యతిరేకత ఎందుకు ?:-
అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానంపై అనేక రాష్ట్రాలలో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్ప కాలం పాటు కాంట్రాక్ట్ పద్దతిలో సైనికులను నియమించుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనలు దెబ్బతింటాయని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. నాలుగేళ్ల ఉద్యోగం కోసం చేరడం వల్ల ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సైన్యంలో చేరడం కోసం రెండేళ్లనుంచి శ్రమించి చదువుకుంటున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది రెండేళ్ల నుంచి నోటిఫికేషన్ లేనందున కనీసం వయో పరిమితి అయిన పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అగ్నిపథ్ విధానంలో రిక్రూట్ అయిన వారికి రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే జీతాలు, అలవెన్స్ లు కూడా తక్కువ, దాంతో ” అగ్నిపథ్ ” విధానంపై అన్నీ వైపులా నుండి వ్యతిరేకత ఏర్పడుతోంది.

అయితే తాజాగా ” అగ్నిపథ్ ” పై ఏర్పడుతున్న వ్యతిరేకతను బట్టి.. వయో పరిమితి ని పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. సాధారణంగా అగ్నిపథ్ లో 17 ఏళ్ల నుండి 21 ఏళ్ళు .. ఉన్న వయోపరిమితిని 23 ఏళ్ల వరకు పెంచుతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఏది ఏమైనప్పటికి అగ్నిపథ్ విధానం పై అన్నీ వైపులా వ్యతిరేకత ఏర్పడుతున్న నేపథ్యంలో.. ముందు రోజుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -