Sunday, May 19, 2024
- Advertisement -

నిర్ల‌క్ష్య‌మే కొంప‌ముంచిందా?

- Advertisement -

నుమాయిష్‌.. 70 సంవత్స‌రాల చ‌రిత్ర క‌లిగిన ఎగ్జిబిష‌న్‌. కానీ ఈ సంవ‌త్స‌రం ఏర్పాటు చేసిన‌ నుమాయిష్‌ అగ్నికి ఆహుతైంది. చిన్న‌గా రేగిన ఓ నిప్పుర‌వ్వ‌.. క‌ళ్ల‌ముందే దావాన‌లంలా మారి మొత్తం ఎగ్జిబిష‌న్‌ను బూడిద చేసింది. ఇంత ప్ర‌మాదంలోనూ సంతోషించాల్సిన విష‌యం ఒక్క‌టే.. ప్ర‌మాదం స‌మ‌యంలో సుమారు 30 వేల మంది సంద‌ర్శ‌కులు అక్క‌డ ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాణ‌న‌ష్టం లేకుండా జ‌ర‌గ‌కుండా వారిని బ‌య‌టికి పంప‌డంలో అధికారులు స‌ఫ‌ల‌మ‌య్యారు. ఈ భారీ ప్ర‌మాదంలో ఏడుగురు అస్వస్థతకు గురవడంతో.. వీరికి సమీపంలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల‌కు పంపారు.

సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఓ బ్యాంక్‌కు సంబంధించిన స్టాల్ సమీపంలో షార్ట్ స‌ర్య్కూట్ కార‌ణంగా మంటలు మొదలయ్యాయి. సందర్శకులు, స్టాళ్ల యజమానులు చూస్తుండగానే.. ఈ మంటలు వేరే స్టాళ్లకు వ్యాపించాయి. వీటిలో చేనేత, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల స్టాళ్లే ఎక్కువగా ఉండ‌టంతో మంట‌ల ఉధృతి అంతకంత‌కు పెరిగిపోయింది. అంతేగాకుండా వివిధ‌ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి స్టాళ్లలోని చిన్న గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

దీంతో అక్క‌డున్న‌వారంతా ప్రాణాలు కాపాడుకోవ‌డానికి బ‌య‌టికి వెళ్లే క్ర‌మంలో స్వ‌ల్ప తొక్కిస‌లాట జ‌రిగింది. ప్ర‌మాద విష‌యాన్ని తెలుసుకున్న అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని స‌హాయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాయి. 20కిపైగా ఫైరింజన్లు దాదాపు మూడు గంట‌లు శ్రమించి మంట‌లు వ్యాపించ‌కుండా అడ్డుకున్నాయి. ఈ ప్ర‌మాదంలో దాదాపు 400 స్టాళ్లు బూడిదయ్యాయి. ఈ దుర్ఘటన తర్వాత.. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుంచి వెళ్లిపోయే సందర్శకుల కోసం అర్థరాత్రి వరకు ఉచితంగా మెట్రో రైళ్లను నడిపారు అధికారులు.

తొలుత నిప్పురవ్వలు చెల‌రేగ‌గానే ఫైర్ సిబ్బందికి స‌మాచార‌మిచ్చామ‌ని.. కానీ వారు లోప‌లికి రావ‌డానికి 30 నిమిషాలు ప‌ట్టింద‌ని.. అందులో నీరు కూడా స‌రిపోయేంత‌ లేక‌పోవ‌డంతోనే ఇంత పెద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు తెలుపుతున్నారు. త‌మ స‌ర్వ‌స్వం కొల్పోయామంటూ స్టాళ్ల య‌జ‌మానులు విల‌పిస్తున్నారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని ఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చిన‌ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ ముందు నిర‌స‌న వ్య‌క్తం చేశారు స్టాళ్ల య‌జ‌మానులు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా హోంమంత్రి వారికి భరోసా ఇచ్చారు.

మొత్తం 2900 స్టాళ్లు ఉన్నాయ‌ని.. మంట‌ల‌ను మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకున్నామ‌ని అధికారులు తెలిపారు. ఏదేమైనా నుమాయిష్ చ‌రిత్ర‌లో ఇంత పెద్ద అగ్నిప్ర‌మాదం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని.. మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -