Saturday, May 18, 2024
- Advertisement -

కాంగ్రెస్ లో కొత్త ఆశలు?

- Advertisement -

చంక‌న బిడ్డ‌ను పెట్టుకొని ఊరంతా వెతికిన‌ట్లుంది.. అన్న ఓ అచ్చ తెలుగు సామెత‌ను మ‌రీ మ‌రీ గుర్తుచేసుకుంటున్నారు టి.కాంగ్రెస్ నేతలు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫ‌లితాలు నిరాశ‌లో ప‌డ్డ కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో బూస్ట్‌నిచ్చిన మాట నిజం. అయితే.. ఇవే ఫ‌లితాలు కొద్దిరోజులుగా వారి వెతుకుతున్న తీగ‌ను కూడా దొరికేట్లు చేశాయి.

తెలంగాణ‌లో నాయ‌క‌త్వ‌లోపం అనే పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన కాంగ్రెస్ కేడ‌ర్ “మాకొక లీడ‌ర్ కావాలి” అంటూ ఎనిమిదిదిక్కుల‌వైపూ చూస్తూ వ‌స్తున్నారు. అయితే.. త‌మ‌కు కావ‌ల‌స‌ని లీడ‌ర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న నాయ‌కులు వేరెక్క‌డో కాదు త‌మ పార్టీలోనే ఉన్న‌ట్లు తాజాగా గుర్తించారు వారు. ఆ నాయ‌కులే ఒక‌రు న‌ల్గొండ జిల్లా నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అయితే.. మ‌రొక‌నేత పాల‌మూరు జిల్లా నేత డి.కె.అరుణ‌లు. పోటీ ఉన్న 12 ఎమ్మెల్సీసీట్లూ అధికార‌ప‌క్షానికి అప్ప‌గించాల్సిందేనా అని అనుమానం ప‌డుతున్న స‌మ‌యంలో మా జిల్లా ఎమ్మెల్సీ సీటును గెలిపించుకునే బాధ్య‌త మాది అని ఓ యుద్ధంలో సైనికుల్లా ప‌నిచేసి మ‌రీ అనుకున్నది సాధించారు ఈ ఇద్ద‌రూ!

అయితే.. గెలిచిన ఎమ్మెల్సీలు వారికి బంధువులో, ద‌గ్గ‌రివారో కాబ‌ట్టే ఇంత ప‌ట్టుద‌ల అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే.. ఇదే రీతిలో క‌ష్ట‌ప‌డితే మాత్రం తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు పున‌ర్వైభ‌వం సాధ్యం అనే న‌మ్మ‌కం క‌లిగింది కాంగ్రెస్ క్యాడ‌ర్‌కు. అందుకే ఈ యుద్ధ‌వీరుల‌కు పార్టీలో రాష్ట్రస్థాయి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్న డిమాండ్ తెర‌పైకి వ‌స్తోంది. అనుభ‌వం పేరుతో సీనియ‌ర్ల‌ను న‌మ్ముకునేక‌న్నా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి ర‌గిలించ‌గ‌ల ఈ ఇద్ద‌రు నేత‌ల నాయ‌క‌త్వంలోనే కాంగ్రెస్ పార్టీకి మ‌నుగ‌డ సాధ్య‌మ‌నే వాద‌న టి.కాంగ్రెస్‌లో ప్రారంభ‌మైంది.

అయితే.. రాష్ట్రస్థాయి బాధ్య‌త‌లంటే.. పిసిసి ప్రెసిడెంట్ స్థాయి త‌ప్ప వేరే ఏ ప‌ద‌వి ఇచ్చినా వారిని మాత్రం సంతృప్తిప‌ర‌చ‌లేని ప‌రిస్థితి. ఈ డిమాండ్ మ‌రింత ముదిరితే.. పార్టీ కోసం, పార్టీ శ్రేణుల డిమాండ్‌కు అనుగుణంగా పిసిసి ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్త‌మ్‌కుమార్ త‌న ప‌ద‌విని వ‌దులుకుని వారికి అప్ప‌గిస్తారా.. అంటే మాత్రం అనుమాన‌మే. స‌వాల‌క్ష లుక‌లుక‌లు, అడ్డ‌దిడ్డ‌మైన ప్ర‌జాస్వామ్యం మెండుగా ఉన్న కాంగ్రెస్‌లో అధిష్టానం సీరియ‌స్‌గా త‌ల్చుకుంటే త‌ప్ప‌ ఇటువంటివి జ‌రుగుతాయ‌ని ఊహించ‌డం వ‌ర‌కే ప‌రిమితం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -